'రైతు బంద్' పేరిట వ్యవసాయ చట్టాలపై ఆర్.నారాయణమూర్తి సినిమా

11-01-2021 Mon 14:47
  • నూతన వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చిన కేంద్రం
  • వ్యతిరేకిస్తూ రైతుల నిరసనలు
  • సాగు చట్టాలకు వ్యతిరేకంగా సినిమా ఉంటుందన్న నారాయణమూర్తి
  • ఫిబ్రవరిలో విడుదల చేస్తానని వెల్లడి
Tollywood film maker Narayanamurthy makes Rythu Band film on agriculture laws

ప్రజా సమస్యలపై విప్లవ పంథాలో సినిమాలు తెరకెక్కించే టాలీవుడ్ ఫిలింమేకర్ ఆర్. నారాయణమూర్తి ప్రస్తుతం జరుగుతున్న రైతు పోరాటంపై సినిమా తీస్తున్నారు. 'రైతు బంద్' పేరుతో ప్రస్తుతం రైతుల నిరసనలకు కారణమైన వ్యవసాయ చట్టాలపై సినిమా తెరకెక్కిస్తున్నట్టు నారాయణమూర్తి ప్రకటించారు. కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా తన సినిమా ఉంటుందని ఆయన వెల్లడించారు. ఫిబ్రవరిలో 'రైతు బంద్' చిత్రం విడుదల చేస్తామని చెప్పారు.

కేంద్రం తీసుకువచ్చిన జాతీయ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ వందల సంఖ్యలో రైతులు దేశ రాజధాని ఢిల్లీలో నెల రోజులకు పైగా నిరసనలు చేపడుతున్నారు. రైతు సంఘాల ప్రతినిధులకు, కేంద్ర మంత్రులకు మధ్య అనేక పర్యాయాలు చర్చలు జరిపినా ఇరువురికి ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించలేదు. చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతులు డిమాండ్ చేస్తుండగా, చట్టాల్లో మీకు నచ్చని అంశాలు చెప్పండి, వాటిని మార్చుకుంటాం అని కేంద్రం చెబుతోంది. దాంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది.