'ట్రంప్ ఓ వేస్ట్ ఫెలో' అంటూ వ్యాఖ్యానించిన హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ స్క్వార్జ్ నెగ్గర్!

11-01-2021 Mon 11:30
  • క్యాపిటల్ హౌస్ అద్దం పగిలింది
  • నాటి నాజీల దాడులను తలపించిన ట్రంప్
  • ట్విట్టర్ లో మండిపడిన ఆర్నాల్డ్
Arnold Called Trump is Waste Fellow Video Viral

అమెరికాకు ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్, ఓ విఫలుడని, వృథా అని, యూఎస్ చరిత్రలోనే చెత్త అధ్యక్షుడిగా మిగిలిపోయారని హాలీవుడ్ హీరో, కాలిఫోర్నియా మాజీ గవర్నర్ ఆర్నాల్డ్ స్క్వార్జ్ నెగ్గర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ మద్దతుదారులను నాజీలతో పోలుస్తూ, గతవారం వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ భవనంపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు తన ట్విట్టర్ లో ఓ వీడియోను ఆర్నాల్డ్ విడుదల చేశారు.

"తోటి అమెరికన్లకు, నా మిత్రులకు ఇటీవల మన దేశంలో జరిగిన కొన్ని ఘటనల గురించి చెప్పాలని అనుకుంటున్నాను. నేను పుట్టి, పెరిగింది ఆస్ట్రియాలో. అక్కడ 1938లో జరిగిన క్రిస్టల్లానాచ్ గురించి (దీన్నే నైట్ ఆఫ్ బ్రోకెన్ గ్లాస్ అని కూడా అంటారు) నాకు తెలుసు. జర్మనీకి చెందిన నాజీలు ఆస్ట్రియాలోని యూదుల ఇళ్లపై దాడికి దిగి, పెను విధ్వంసానికి కారణమయ్యారు. యూఎస్ లోని ప్రౌడ్ బాయ్స్ (ట్రంప్ మద్దతుదారుల గ్రూప్ పేరు) ఇప్పుడు అదే పని చేసింది. క్యాపిటల్ భవంతికి ఉన్న అద్దం పగిలిందంటే, అది కేవలం అద్దం మాత్రమే కాదు. అమెరికా కాంగ్రెస్ చట్ట సభ్యుల ఆలోచన కూడా. వారంతా ప్రజాస్వామ్యాన్ని తుంగలోకి తొక్కారు" అని అన్నారు.

అమెరికా రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని భావించే వారు ఎవరూ అధ్యక్షుడిగా ఉండలేరని, ఎన్నికల్లో విజయం సాధించలేరని వ్యాఖ్యానించిన ఆయన, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలంతా రానున్న కొత్త నేత జో బైడెన్ కు మద్దతు పలకాలని సూచించారు.

కాగా, 'టర్మినేటర్' సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆర్నాల్డ్ ఫ్యామిలీ ఆస్ట్రియా నుంచి అమెరికాకు వలస వచ్చింది. ఆపై ఆయన 2003లో కాలిఫోర్నియా గవర్నర్ గానూ విజయం సాధించారు. ఆయన రిపబ్లికన్ పార్టీకి చెందినప్పటికీ, తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు వ్యక్తం చేస్తూ, ఇప్పటికే పలుమార్లు విమర్శించిన సంగతి తెలిసిందే.