Virat Kohli: రౌడీయిజానికి ఇది పరాకాష్ఠ... సిరాజ్ పై జాత్యహంకార వ్యాఖ్యల పట్ల కోహ్లీ స్పందన

  • సిడ్నీ టెస్టులో జాతివివక్ష కలకలం
  • నిన్న సిరాజ్, బుమ్రాలపై జాత్యహంకార వ్యాఖ్యలు
  • ఇవాళ సిరాజ్ పై నోరుపారేసుకున్న ప్రేక్షకులు
  • తీవ్రంగా ఖండించిన కోహ్లీ
Kohli reacts to racial abuses towards Mohammed Siraj in Sydney test

సిడ్నీలో ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య టెస్టు జరుగుతున్న సందర్భంగా ప్రేక్షకుల్లోంచి కొందరు జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం తీవ్ర కలకలం రేపింది. నిన్న టీమిండియా బౌలర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. మళ్లీ ఇవాళ కూడా సిరాజ్ ను లక్ష్యంగా చేసుకుని కొందరు ప్రేక్షకులు జాతి వివక్షపూరిత వ్యాఖ్యలు చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. దీనిపై టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్రంగా స్పందించాడు.

జాతివివక్ష దూషణలు ఏ విధంగానూ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశాడు. గతంలోనూ బౌండరీ లైన్ల వద్ద ఇలాంటివి ఎన్నో నీచమైన ఉదంతాలు జరిగాయని ఇప్పుడు జరిగిన ఘటనలు రౌడీ తరహా ప్రవర్తనకు పరాకాష్ఠ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫీల్డింగ్ చేస్తుండగా జాత్యహంకార వ్యాఖ్యలు ఎదుర్కోవాల్సి రావడం బాధాకరం అని కోహ్లీ పేర్కొన్నాడు. ఇలాంటి ఘటనలను ఎంతో తీవ్రమైనవిగా పరిగణించి, అత్యవసర ప్రాతిపదికన విచారణ జరపాలని డిమాండ్ చేశాడు. మరోసారి ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా కఠినశిక్షలు విధించాలని తెలిపాడు.

కాగా, సిడ్నీ టెస్టులో జాతి వివక్ష కలకలం రేగడం పట్ల ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) క్షమాపణలు కోరింది. తమ స్నేహితులైన భారత ఆటగాళ్లు తమను మన్నించాలని, ప్రేక్షకుల్లో కొందరి ప్రవర్తన పట్ల తాము చింతిస్తున్నామని ఓ ప్రకటన విడుదల చేసింది.

అటు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కూడా దీనిపై దృష్టి సారించింది. సిడ్నీలో వర్ణ వివక్ష పూరిత వ్యాఖ్యలు చోటుచేసుకోవడాన్ని ఐసీసీ ఖండించింది. వ్యాఖ్యలు చేసినవారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తమకు నివేదించాలంటూ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు స్పష్టం చేసింది.

More Telugu News