బాలాకోట్ దాడుల్లో 300 మంది ఉగ్రవాదుల హతం.. పాకిస్థాన్ ఒప్పుకోలు

10-01-2021 Sun 07:15
  • 14 ఫిబ్రవరి 2019లో సీఆర్పీఎఫ్ సైనిక స్థావరంపై ఉగ్రదాడి
  • 40 మంది జవాన్లు హతం
  • అదే నెల 26న బాలాకోట్ ఉగ్రస్థావరాలపై భారత్ బాంబుల వర్షం
300 Casualties In Balakot Airstrike By India

14 ఫిబ్రవరి 2019లో పుల్వామాలోని సైనిక స్థావరంపై పాక్ ప్రేరేపిత జైషే మహ్మద్‌ సంస్థకు చెందిన ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది సీఆర్పీఫ్ జవాన్లు అమరులయ్యారు. ఈ దాడికి ప్రతీకారంగా అదే నెల 26న పాక్ భూభాగంలోని బాలాకోట్‌పై భారత్ సర్జికల్ స్ట్రైక్‌ చేపట్టి పదుల సంఖ్యలో ఉగ్రవాదులను హతమార్చింది. అయితే, ఈ దాడుల్లో తమ వైపు నుంచి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అప్పట్లో పాకిస్థాన్ బుకాయించింది. అయితే, భారత్ మాత్రం పదుల సంఖ్యలో ఉగ్రవాదులను హతమార్చినట్టు చెప్పింది.

తాజాగా, ఈ విషయంలో స్పష్టత వచ్చింది. బాలాకోట్ ఉగ్రస్థావరాలపై భారత్ జరిపిన వైమానిక దాడుల్లో 300 మంది ఉగ్రవాదులు మరణించినట్టు పాకిస్థాన్ మాజీ దౌత్యవేత్త అఘా హిలాలీ తాజాగా వెల్లడించారు. ఓ ఉర్దూ చానల్‌తో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పటి వరకు ఈ విషయంలో పాక్ చెబుతున్నదంతా అబద్ధమని తేలిపోయింది.