రవీంద్ర జడేజాకు గాయం... ఆసీస్ పర్యటన నుంచి అవుట్

09-01-2021 Sat 21:58
  • సిడ్నీ టెస్టులో గాయపడిన జడేజా
  • స్కార్క్ బౌలింగ్ లో బొటనవేలికి తగిలిన బంతి
  • జడేజా గాయానికి స్కానింగ్
  • ఎముక చిట్లినట్టు వెల్లడి
  • జడేజాకు ఆరు వారాల విశ్రాంతి!
Ravindra Jadeja ruled out of Australia tour

టీమిండియాలో గాయపడిన ఆటగాళ్ల జాబితాలో ఇప్పుడు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా చేరాడు. సిడ్నీ టెస్టులో బ్యాటింగ్ చేస్తుండగా జడేజా గాయపడ్డాడు. ఆసీస్ లెఫ్టార్మ్ పేసర్ మిచెల్ స్టార్క్ విసిరిన ఓ భీకర బౌన్సర్ జడేజా బొటన వేలికి బలంగా తాకింది.

 బాధతో విలవిల్లాడిన జడేజాను ఆసుపత్రికి తరలించి స్కానింగ్ తీయగా, బొటనవేలి ఎముక చిట్లినట్టు తేలింది. దాంతో జడేజా ఈ టెస్టులోనే కాదు, సిరీస్ లో మిగిలిన నాలుగో టెస్టులోనూ ఆడే అవకాశాల్లేవు. ఈ గాయంతో జడేజా మరో 6 వారాల వరకు మైదానంలో దిగడం కష్టమేనని టీమిండియా వర్గాలంటున్నాయి

ఇక, ఇదే మ్యాచ్ లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా గాయపడ్డాడు. కంగారూ ఫాస్ట్ బౌలర్ కమ్మిన్స్ వేసిన బంతి పంత్ మోచేతిని బలంగా తాకింది. దాంతో పెయిన్ కిల్లర్స్ తీసుకుని బ్యాటింగ్ కొనసాగించిన పంత్... ఆ తర్వాత, ఆసీస్ బ్యాటింగ్ చేస్తుండగా మళ్లీ బరిలో దిగలేదు. అతడి స్థానంలో వృద్ధిమాన్ సాహా కీపింగ్ చేశాడు.

 అయితే ఊరట కలిగించే అంశం ఏమిటంటే, పంత్ గాయం తీవ్రత తక్కువేనని స్కానింగ్ లో తేలింది. ఎముకలో ఎలాంటి పగుళ్లు లేవని స్పష్టం కావడంతో టీమిండియా శిబిరం ఊపిరి పీల్చుకుంది. కాగా, ఇప్పటికే మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్ వంటి కీలక ఆటగాళ్లు గాయాలతో సిరీస్ కు దూరమైన సంగతి తెలిసిందే.