Somu Veerraju: స్థానిక సంస్థల ఎన్నికలకు మేము సిద్ధం.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి: సోము వీర్రాజు

  • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ దైర్జన్యాలకు పాల్పడింది
  • దౌర్జన్యాలతో 25 శాతం స్థానాలను కైవసం చేసుకుంది
  • పూర్తి స్థాయిలో మళ్లీ ఎన్నికలను నిర్వహించాలి
We are ready for local body polls says Somu Veerraju

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలైంది. నిన్న రాత్రి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ, స్థానిక ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. గతంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సమయంలో అధికార వైసీపీ దాదాపు 25 శాతం స్థానాలను దౌర్జన్యాలతో కైవసం చేసుకుందని ఆరోపించారు.

స్థానిక సంస్థలకు సంబంధించి పాత నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ గతంలోనే ఎన్నికల సంఘానికి తాము ఫిర్యాదు చేశామని తెలిపారు. ఇదే విషయాన్ని అఖిలపక్ష సమావేశంలో కూడా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కు చెప్పామని గుర్తు చేశారు. తమ విన్నపాన్ని ఎస్ఈసీ పట్టించుకోలేదని... ఇప్పుడు కేవలం పంచాయతీలకు నోటిఫికేషన్ మాత్రమే విడుదల చేశారని... పాత నోటిఫికేషన్ ను రద్దు చేయలేదని అన్నారు. పాత నోటిఫికేషన్ ను రద్దు చేసి పూర్తి స్థాయిలో ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు.

మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేయడంపై అధికార వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక పార్టీకి కొమ్ముకాసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారంటూ నిమ్మగడ్డపై విమర్శలు చేస్తున్నారు. కరోనా సమయంలో తాము ఎన్నికల విధులను నిర్వహించలేమంటూ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు కూడా ప్రకటించారు.

More Telugu News