గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్న సినీనటి కరాటే కల్యాణి

09-01-2021 Sat 10:29
  • హైదరాబాద్ శివార్లలో రెండు వాహనాలను అడ్డుకున్న కల్యాణి
  • ఆమె ఫిర్యాదు మేరకు గోవధ నిషేధ చట్టం కింద కేసు నమోదు
  • రాజకీయాల్లో దూకుడు పెంచుతున్న కల్యాణి
Actress Karate Kalyani blocked Cows transportation

పలు సినిమాలతో ప్రేక్షకులను అలరించి, ఎంతో మంది అభిమానాన్ని మూటకట్టుకున్న కరాటే కల్యాణి రాజకీయ నాయకురాలిగా కూడా తన సత్తా ఏంటో చూపించారు. గోవులను అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను ఆమె అడ్డుకుని ఔరా అనిపించారు. వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ శివార్లలోని బీబీనగర్ లో రెండు వాహనాల్లో తరలిస్తున్న గోవులను ఆమె అడ్డుకున్నారు. ఈ సందర్భంగా 25 గోవులను కాపాడారు. అంతేకాదు గోవులను తరలిస్తున్న వారిపై ఆమె ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు నిందితులపై గోవధ నిషేధ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.  

కరాటే కల్యాణి ప్రస్తుతం బీజేపీలో ఉన్న సంగతి తెలిసిందే. మొన్నట్లో రామతీర్థం వద్ద బీజేపీ శ్రేణులు చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో సైతం ఆమె పాల్గొన్నారు. ఎమ్మెల్సీ మాధవ్ తో కలిసి ఆమె ధర్నాలో పాల్గొన్నారు. ఇప్పటికే ఆమె ఎన్నో సామాజిక సమస్యలపై తన గళం వినిపిస్తున్నారు. ఆమె దూకుడు చూస్తుంటే రాబోయే రోజుల్లో రాజకీయాల్లో మరింత క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.