ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీ

09-01-2021 Sat 08:38
  • ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న ప్రశాంత్ కిశోర్
  • సీఎంతో గంటన్నరపాటు భేటీ
  • తిరుపతి ఉప ఎన్నిక, సంక్షేమ పథకాలపై చర్చ
Prashant Kishore meets YS Jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ గెలుపు కోసం గత ఎన్నికల్లో పనిచేసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నిన్న సీఎంతో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఇద్దరి మధ్య దాదాపు గంటన్నరపాటు చర్చలు జరిగాయి. ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాల అమలు, రాజకీయ పరిణామాలపై వీరు నిశితంగా మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం గురించే వీరు చర్చించినట్టు సమాచారం.

నిన్న ఉదయం ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న ప్రశాంత్ కిశోర్ అక్కడి నుంచి నేరుగా జగన్ నివాసానికి చేరుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అక్కడే ఉన్నారు. నిజానికి గత వారమే వీరు భేటీ కావాల్సి ఉండగా, అనుకోని కారణాల వద్ద వాయిదా పడింది. సామాజిక మాధ్యమాల్లో ‘నవరత్నాలు’పై జరుగుతున్న ప్రచారం, రాష్ట్రంలోని ఆలయాలపై జరుగుతున్న దాడులు, తిరుపతి లోక్‌సభకు జరగనున్న ఉప ఎన్నికకు సంబంధించిన విషయాలను ఇరువురు చర్చించినట్టు సమాచారం.