'చైనా టీకా యమ డేంజర్' అంటూ వ్యాఖ్యలు చేసి.. ఆపై మాట మార్చిన వైద్య నిపుణుడు

08-01-2021 Fri 16:38
  • వ్యాక్సిన్ తయారుచేసిన సైనోఫామ్
  • సైనోఫామ్ ప్రభుత్వ అధీనంలోని సంస్థ
  • ఈ టీకా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్న నిపుణుడు
  • ఇంతకంటే ప్రమాదకరమైంది మరొకటి లేదని వ్యాఖ్యలు
  • ఆపై, విదేశీ మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించిందని వెల్లడి
China medical expert comments on corona vaccine

చైనాలో చాలా సంస్థలు ప్రభుత్వ అధీనంలో పనిచేస్తుంటాయి. అలాంటివాటిలో సైనోఫామ్ కూడా ఒకటి. అయితే సైనోఫామ్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ పై చైనా వైద్య నిపుణుడు టావో లినా తీవ్ర వ్యాఖ్యలు చేసి, ఆపై మాట మార్చారు. సైనోఫామ్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ అత్యంత ప్రమాదకరం అని టావో లినా పేర్కొన్నారు. ఈ వార్తను విదేశీ మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. దాంతో లినా మాట మార్చి, తాను చెప్పిన మాటలను ఇతర దేశాల మీడియా సంస్థలు వక్రీకరించాయని ఆరోపించారు.

అయితే తాను చెప్పిన మాటల్లో కొన్నింటి పట్ల చింతిస్తున్నానని, తాను జాగ్రత్తగా మాట్లాడివుంటే బాగుండేదని టావో లినా అభిప్రాయపడ్డారు. అందుకు చైనా ప్రజలు తనను క్షమించాలని విజ్ఞప్తి చేశారు. వాస్తవానికి టావో లినా చేసిన వ్యాఖ్యలు ఏంటంటే.... సైనోఫామ్ టీకా అంత ప్రమాదకరమైన టీకా ప్రపంచంలో మరొకటి లేదన్నారు. ఈ వ్యాక్సిన్ తీసుకుంటే 73 రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని తెలిపారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతా (వీబో)లో వెల్లడించారు.

తన వ్యాఖ్యల పట్ల తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గిన టావో లినా.... సైనోఫామ్ వ్యాక్సిన్ విషయంలో ఎవరూ భయపడాల్సిన పనిలేదని, తాను ఇప్పటికే ఒక డోసు వేయించుకున్నానని, మరికొన్ని రోజుల్లో రెండో డోసు వేయించుకుంటున్నానని తెలిపారు. కాగా, చైనా అధికారిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ కూడా తమ దేశ వైద్య నిపుణుడు టావో లినా వ్యాఖ్యలను విదేశీ మీడియా వక్రీకరించిందని తెలిపింది.