ఫేవరెట్ ప్లేయర్ ఎవరంటూ టీమిండియా ఆటగాళ్లను విసిగించిన ఆసీస్ క్రికెటర్... వీడియో ఇదిగో!

08-01-2021 Fri 14:52
  • సిడ్నీ టెస్టులో స్లెడ్జింగ్
  • నోటికి పని చెప్పిన ఆసీస్ ఆటగాడు లబుషేన్
  • గిల్, రోహిత్ శర్మలపై ప్రశ్నల వర్షం
  • ఏమాత్రం పట్టించుకోని భారత ఓపెనర్లు
Aussies cricketer comments on Rohit Sharma and Shubhman Gill while batting

క్రికెట్ లో స్లెడ్జింగ్ సాధారణమైపోయింది. ప్రత్యర్థి ఆటగాళ్ల ఏకాగత్రను చెడగొట్టేందుకు అనేక జట్లు స్లెడ్జింగ్ కు పాల్పడుతుంటాయి. ఆసీస్ ఆటగాళ్లు ఇలాంటి మాటలయుద్ధాల్లో ఆరితేరినవాళ్లు! తాజాగా, టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మాన్ గిల్ బ్యాటింగ్ చేస్తుండగా, షార్ట్ పొజిషన్ లో ఫీల్డింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబుషేన్ నోటికి పని కల్పించాడు.

నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరంటూ మొదట గిల్ ను ప్రశ్నించాడు. దానికి గిల్ స్పందిస్తూ, ఆ విషయం నీకు తర్వాత చెబుతానని బదులిచ్చాడు. దాంతో, లబుషేన్... ఈ బంతి ఆడిన తర్వాతా...? అంటూ రెట్టించాడు. అంతేకాదు, సచిన్ అంటే ఇష్టమా? విరాట్ కోహ్లీని ఇష్టపడతావా? అంటూ విసిగించాడు. అయితే, గిల్ ఇవేవీ పట్టించుకోకుండా తన పాటికి తాను బ్యాటింగ్ చేశాడు.

ఆ తర్వాత రోహిత్ శర్మ స్ట్రయికింగ్ కు వచ్చినప్పుడు కూడా లబుషేన్ స్లెడ్జింగ్ షురూ చేశాడు. "క్వారంటైన్ లో ఏంచేశావు?" అంటూ రోహిత్ శర్మను ప్రశ్నించాడు. కానీ, రోహిత్ శర్మ ఎంతో కూల్ గా బ్యాటింగ్ చేస్తూ లబుషేన్ మాటలను పట్టించుకోలేదు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.