పోలీసులకు కుల, మతాలు ఆపాదించడం ఎంతవరకు సమంజసం?: ఏపీ పోలీసు అధికారుల సంఘం 

07-01-2021 Thu 20:41
  • ఏపీలో ఆలయాలపై దాడులు
  • పోలీసుల తీరుపై నేతల విమర్శలు
  • రాజకీయ నేతల వ్యాఖ్యలను తప్పుబట్టిన పోలీసు అధికారుల సంఘం
  • సర్వమతాల కలయికే పోలీసు శాఖ 
Police officers association condemns AP political leaders comments

ఆలయాలపై దాడుల ఘటనల పట్ల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్పందిస్తూ సీఎం, హోంమంత్రి, డీజీపీ క్రైస్తవులేనని పేర్కొనడం పట్ల రాష్ట్ర పోలీసు అధికారులు సంఘం తీవ్రంగా స్పందించింది. అంతేకాదు, ఇతర నేతలు కూడా విగ్రహాల ధ్వంసం తదనంతర ఘటనల్లో పోలీసుల తీరును తప్పుబట్టడాన్ని ఖండించింది. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన గౌరవనీయ నేత పోలీసులకు కుల,మతాలు ఆపాదించడం ఎంతవరకు సమంజసం అని ఆగ్రహం వ్యక్తం చేసింది. బౌద్ధ, క్రైస్తవ, సిక్కు వంటి సర్వమత కలయికే పోలీసు శాఖ అని స్పష్టం చేసింది.

కొందరు రాజకీయ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆ వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నట్టు పోలీసు అధికారుల సంఘం నేతలు తెలిపారు. రాజ్యాంగం, చట్టం తమకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ లతో సమానం అని స్పష్టం చేశారు. స్వార్థ రాజకీయాల కోసం మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొడుతూ, పోలీసులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం దేనికి నిదర్శనం అని ప్రశ్నించారు.