Centre: 100 శాతం సీటింగ్ తో ప్రదర్శనలు వద్దు... ఆదేశాలను వెనక్కి తీసుకోవాలంటూ తమిళనాడు సర్కారుకు స్పష్టం చేసిన కేంద్రం

  • 100 శాతం ప్రేక్షకులతో ప్రదర్శనలకు తమిళనాడు ఓకే
  • తమ మార్గదర్శకాలకు వ్యతిరేకమన్న కేంద్రం
  • 50 శాతం ప్రేక్షకులకే తమ అనుమతి అని స్పష్టీకరణ
  • తాజాగా ఆదేశాలు జారీ చేయాలని తమిళనాడు సర్కారుకు లేఖ
Centre shot a letter to Tamilnadu government to revoke hundred percent seating for cinema shows

సినిమా హాళ్లు, మల్టీప్లెక్సుల్లో 100 శాతం సీటింగుతో సినిమా ప్రదర్శనలు నిర్వహించుకోవచ్చంటూ గతవారం తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నిర్ణయం తమ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఉందని కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. 100 శాతం సీటింగ్ తో సినిమా ప్రదర్శనల ఆదేశాలను వెనక్కి తీసుకోవాలంటూ తమిళనాడు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా తమిళనాడు ప్రభుత్వానికి లేఖ రాశారు.

కేంద్రం అన్ లాక్ ప్రక్రియలో భాగంగా 50 శాతం ప్రేక్షకులతో సినిమా ప్రదర్శనలకు మాత్రమే అనుమతిచ్చిందని, ఈ ఆంక్షలను జనవరి 31 వరకు పొడిగించారని ఆ లేఖలో పేర్కొన్నారు. అందువల్ల ఏ రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం కేంద్ర మార్గదర్శకాలను తమకు అనుగుణంగా మార్చుకోరాదని స్పష్టం చేశారు. పైగా, సుప్రీంకోర్టు కూడా ఇప్పటికీ మాస్కులు, భౌతికదూరం నిబంధనలు తప్పనిసరి అని పేర్కొందని ఆ లేఖలో వివరించారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని తమిళనాడు ప్రభుత్వం తన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు. కేంద్రం డిసెంబరు 28న జారీ చేసిన మార్గదర్శకాలను గౌరవించేలా తాజా ఆదేశాలు ఇవ్వాలని స్పష్టం చేశారు.

కాగా, తమిళనాడు ప్రభుత్వం 100 శాతం సీటింగ్ తో సినిమా ప్రదర్శనలకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తమకు కూడా అలాంటి అనుమతులు ఇవ్వాలంటూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు లేఖ రాసింది. ఇప్పుడు కేంద్రం తమిళనాడుకు రాసిన లేఖ తెలుగు చిత్ర పరిశ్రమకు కచ్చితంగా నిరాశ కలిగించేదే.

More Telugu News