మూడో టెస్టుకు మయాంక్ స్థానంలో రోహిత్ శర్మ... పేసర్ స్థానం కోసం సైనీ, శార్దూల్ మధ్య పోటీ

05-01-2021 Tue 21:30
  • ఈ నెల 7 నుంచి మూడో టెస్టు
  • సిడ్నీ వేదికగా మ్యాచ్
  • సన్నద్ధమవుతున్న భారత్, ఆస్ట్రేలియా
  • 1-1తో సమవుజ్జీలుగా ఇరుజట్లు
Third test at Sydney Cricket Ground

ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా మూడో టెస్టు ఈ నెల 7న సిడ్నీలో ప్రారంభం కానుంది. కరోనా ప్రోటోకాల్ నిబంధనల ఉల్లంఘన వివాదం సమసిపోవడంతో ఇప్పుడందరి దృష్టి మళ్లీ సిరీస్ పై పడింది. తొలి టెస్టులో ఆసీస్ గెలవగా, రెండో టెస్టును భారత్ చేజిక్కించుకుంది. దాంతో ఆసీస్, భారత్ 1-1తో సమవుజ్జీలుగా మూడో టెస్టులో అడుగుపెడుతున్నాయి. ఇక జట్టు కూర్పు విషయానికొస్తే వరుసగా విఫలమవుతున్న మయాంక్ అగర్వాల్ స్థానంలో డాషింగ్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ జట్టులోకి రావడం దాదాపు ఖాయమైంది.

అయితే, ఉమేశ్ యాదవ్ రెండో టెస్టులో గాయపడడంతో అతడి స్థానంలో ఎవర్ని తీసుకోవాలన్నది సమస్యగా మారింది. శార్దూల్ ఠాకూర్, నవదీప్ సైనీల మధ్య ఒక పేసర్ స్థానం కోసం గట్టి పోటీ నెలకొంది. శార్దూల్ ఠాకూర్ కాస్తో కూస్తో అనుభవం ఉన్న బౌలర్ కాగా, సైనీ టెస్టులకు కొత్తే. అయితే, సైనీ గంటకు 140 కిమీ పైచిలుకు వేగంతో బంతులు వేస్తాడని, మొరటు బలంతో అతడు వేసే పేస్ కు ఆసీస్ బ్యాట్స్ మెన్ ఇబ్బందిపడతారని క్రికెట్ పండితులు అంటున్నారు. మరి టీమిండియా మేనేజ్ మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.