IMD: మంటపుట్టించిన 2020.. ఎనిమిదో వేడి సంవత్సరంగా రికార్డ్​!

  • లాక్ డౌన్లు పెట్టినా.. జనాలు తిరగకపోయిన పెరిగిన ఉష్ణోగ్రతలు
  • అత్యంత వేడి సంవత్సరంగా 2016కు మొదటి స్థానం
  • గత ఏడాది నెలవారీ ఉష్ణోగ్రతల్లోనూ భారీ పెరుగుదల
  • తీవ్ర వాతావరణ పరిస్థితులతో 1,565 మంది మృతి
  • 115 మందిని బలి తీసుకున్న తుపాన్లు 
2020 was 8th warmest year since 1901 killed 1500 in extreme weather events in India says IMD

ఎండాకాలంలో గడప దాటి బయట అడుగు పెట్టాలంటే భయం.. భానుడి భగభగలు ఎక్కడ మంటపుట్టిస్తాయోనని! మరి, అంతలా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఏ ఏడాదికి ఆ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 2020 కూడా ఆ జాబితాలో చేరిపోయింది. ఎన్ని లాక్ డౌన్ లు పెట్టినా.. జనాలు తిరగకపోయినా.. మన దగ్గర ఉష్ణోగ్రతల నమోదు మొదలైన 1901 నుంచి ఇప్పటిదాకా ఎనిమిదో వేడి సంవత్సరంగా రికార్డులకెక్కింది.

ఈ కాలంలో మొత్తం 15 వేడి సంవత్సరాలు నమోదైతే.. అందులో 12 ఏళ్లు గత పదిహేనేళ్లలోనే (2006–2020) ఉన్నాయంటే ఉష్ణోగ్రతలు ఏ రేంజ్ లో పెరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. 2020లో భారత వాతావరణ పరిస్థితుల పేరిట మంగళవారం భారత వాతావరణ శాఖ (ఐఎండీ)  నివేదికను విడుదల చేసింది.

1901 నుంచి అత్యంత వేడి సంవత్సరంగా 2016 రికార్డు సృష్టించిందని, ఆ ఏడాదితో పోలిస్తే 2020లో నమోదైన ఉష్ణోగ్రతలు చాలా తక్కువేనని పేర్కొంది. గత రెండు దశాబ్దాలు 2001–2010, 2011–2020లు అత్యంత వేడి దశాబ్దాలని, ఆయా కాలాల్లో సగటున వరుసగా 0.23 డిగ్రీలు, 0.34 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగాయని వెల్లడించింది.

1901 నుంచి 2020 వరకు మన దేశంలో సగటున వందేళ్లకు 0.62 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు పెరిగాయని ఐఎండీ చెప్పింది. గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో 0.99 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో 0.24 డిగ్రీల మేర పెరుగుదల నమోదైందని పేర్కొంది. 2020లో సగటు భూ ఉపరితల వాయు ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా సగటున 0.29 డిగ్రీలు పెరిగాయని వివరించింది.  

అంతేగాకుండా సగటు నెలవారీ ఉష్ణోగ్రతల్లోనూ పెరుగుదల నమోదైందని ఐఎండీ పేర్కొంది. మార్చి, జూన్ మినహా మిగతా అన్ని నెలల్లోనూ వేడి సాధారణం కన్నా ఎక్కువగానే ఉందని వెల్లడించింది. అత్యధికంగా సెప్టెంబర్ లో 0.72 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వివరించింది.

మరోవైపు ఇప్పటిదాకా ఐదు అత్యంత వేడి సంవత్సరాలు 2016 (0.71 డిగ్రీలు పెరుగుదల), 2009 (0.55 డిగ్రీలు), 2017 (0.541 డిగ్రీలు), 2019 (0.539 డిగ్రీలు), 2015 (0.42 డిగ్రీలు) అని ఐఎండీ చెప్పింది.

2020లో అత్యంత తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల 1,565 మంది మరణించారని పేర్కొంది. అందులో 815 మంది పిడుగులు, వానవరదలతోనే చనిపోయారని వెల్లడించింది. ఒక్క 2020లో తుపాన్ల వల్ల 115 మంది చనిపోయారని, 17 వేలకుపైగా పశువులు మృతి చెందాయని చెప్పింది.

More Telugu News