Ration: ఫిబ్రవరి 1 నుంచి ఏపీలో రేషన్ డోర్ డెలివరీ: సీఎం జగన్

  • క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష
  • హాజరైన మంత్రి కొడాలి నాని, సీనియర్ అధికారులు
  • ఈ నెల మూడో వారంలో రేషన్ పంపిణీ వాహనాల ప్రారంభం
  • అదే రోజున 10 కేజీల బియ్యం సంచుల ఆవిష్కరణ
Ration at door steps scheme will start next month in AP

రేషన్ సరుకులు ఇంటి వద్దకే సరఫరా చేయాలన్నది ఏపీ ప్రభుత్వం ఎన్నాళ్ల నుంచో అనుకుంటున్న పథకం. గత కొన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ పథకాన్ని ఈసారి గట్టిగా అమలు చేయాలని వైసీపీ సర్కారు కృతనిశ్చయంతో ఉంది. ఫిబ్రవరి 1 నుంచి ఏపీలో రేషన్ సరుకుల డోర్ డెలివరీ ఉంటుందని సీఎం జగన్ ఇవాళ వెల్లడించారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, నూతన  సీఎస్ ఆదిత్యనాథ్, సంబంధిత శాఖ సీనియర్ అధికారులతో సీఎం జగన్ ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ నెల మూడో వారంలో రేషన్ సరుకుల పంపిణీ కోసం ప్రత్యేక వాహనాలను ప్రారంభించనున్నారు. అదే రోజున 10 కిలోల బియ్యం సంచులను ఆవిష్కరిస్తారు. ఇంటి వద్దకే రేషన్ సరఫరా కోసం ప్రభుత్వం 9,260 వాహనాలను సిద్ధం చేసింది. వాటిలో తూకం యంత్రాలు కూడా ఉంటాయి. కాగా, సమీక్ష సందర్భంగా, ధాన్యం సేకరణ మార్గదర్శకాలను కూడా సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు. ధాన్యం సేకరించిన అనంతరం 15 రోజుల్లోగా రైతులకు చెల్లింపులు జరిగేలా చూడాలని ఆదేశించారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యానికి సంబంధించి ఏవైనా బకాయిలు ఉంటే సంక్రాంతి నాటికి చెల్లించాలని సూచించారు.

More Telugu News