Lakshman: ఆలయాలపై దాడులను జగన్ తక్కువ చేసి మాట్లాడుతున్నారు: తెలంగాణ బీజేపీ నేత లక్ష్మణ్

  • దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
  • లేనిపక్షంలో దేవాదాయశాఖను ఎత్తేసి ఆలయాలను హిందూ సమాజానికి ఇవ్వాలి
  • వైసీపీ, టీడీపీలకు సీపీఐ తోకపార్టీలా మారింది
Telangana BJP leader Lakshmans comments on Jagan

ఏపీలో హిందూ ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడులు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. ఈరోజు కూడా రెండు చోట్ల ఆలయాలపై దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి.

మరోవైపు తెలంగాణ బీజేపీ నేతలు సైతం ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. విగ్రహాలను ధ్వంసం చేస్తున్నా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎందుకు స్పందించడం లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. తెలంగాణకు చెందిన మరో బీజేపీ సీనియర్ నేత లక్షణ్ కూడా ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

ఆలయాలపై జరుగుతున్న దాడులను ముఖ్యమంత్రి జగన్ తక్కువ చేసి మాట్లాడటం సరికాదని లక్ష్మణ్ దుయ్యబట్టారు. దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని... కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే దుండగులు ఆలయాలపై మళ్లీమళ్లీ దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. లేనిపక్షంలో దేవాదాయ శాఖను ఎత్తేసి... ఆలయాలను హిందూ సమాజానికి ఇవ్వాలని చెప్పారు.

ఇదే సమయంలో సీపీఐ నారాయణపై కూడా లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు. ఆలయాలపై దాడుల వెనుక బీజేపీ హస్తం ఉందంటూ సీపీఐ నారాయణ మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. వైసీపీ, టీడీపీలకు సీపీఐ తోకపార్టీలా మారిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను రాబట్టాలంటే తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ, జనసేన సంయుక్త అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

More Telugu News