Vellampalli Srinivasa Rao: అశోక్ గజపతిరాజుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మంత్రి వెల్లంపల్లిపై క్షత్రియ నేతల ఫైర్

Kshatriya leaders are firing on Vellampalli
  • అశోక్ గజపతిరాజును 'వెధవ' అన్న వెల్లంపల్లి
  • హైదరాబాదులో వెల్లంపల్లి దిష్టిబొమ్మ దగ్ధం
  • వెల్లంపల్లి ఒక పనికిమాలిన మంత్రి అన్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే
ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై క్షత్రియ సామాజికవర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజును 'వెధవ' అంటూ వెల్లంపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాదులోని కొంపల్లిలో క్షత్రియులు వెల్లంపల్లి దిష్టిబొమ్మను దగ్థం చేశారు. ఇలాంటి వ్యక్తులను ముఖ్యమంత్రి జగన్ ఉపేక్షించకూడదని అన్నారు. ఏపీలో సైతం క్షత్రియులు వెల్లంపల్లిపై మండిపడుతున్నారు.

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ, అశోక్ గజపతిరాజు గురించి వ్యాఖ్యానించేంతటి స్థాయి నీకెక్కడిదని మండిపడ్డారు. విజయవాడలో నీవొక వీధి రౌడీవని దుయ్యబట్టారు. నీ శాఖను పాలించడం నీకు చేతకాకపోతే రాజీనామా చెయ్ అని అన్నారు. నీవొక పనికిమాలిన మంత్రివి, దద్దమ్మ మంత్రివని... నీకు మంత్రి పదవి ఎలా ఇచ్చారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. 125 దేవాలయాలపై దాడి జరిగితే చర్యలు తీసుకోలేకపోయావని దుయ్యబట్టారు. రామతీర్థంకు చంద్రబాబు వెళ్తే వైసీపీ భయపడిందని అన్నారు.

కాకినాడ నగర మాజీ ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ, విజయవాడ అమ్మవారి గుడిలో వెండి సింహాలు మాయమైనప్పుడు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే బుచ్చిరాజు మాట్లాడుతూ, రూ. 14 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తులను ప్రజల కోసం ధారాదత్తం చేసిన కుటుంబంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు.


Vellampalli Srinivasa Rao
YSRCP
Jagan
Ashok Gajapathi Raju
Telugudesam

More Telugu News