Justice Joymalya Bagchi: ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ జోయ్ మల్య బాగ్చి

Justice Joymalya Bagchi taking oath as AP High Court judge
  • కలకత్తా హైకోర్టు నుంచి బదిలీపై వచ్చిన బాగ్చి
  • బాగ్చితో ప్రమాణం చేయించిన హైకోర్టు సీజే మహేశ్వరి
  • ఏపీ హైకోర్టులో 19గా ఉన్న న్యాయమూర్తుల సంఖ్య
  • సీజే మహేశ్వరికి ఇవాళ వీడ్కోలు సభ
  • ఎల్లుండి నూతన సీజేగా అరూప్ గోస్వామి ప్రమాణస్వీకారం
ఇటీవలే బదిలీపై కలకత్తా హైకోర్టు నుంచి ఏపీ హైకోర్టుకు వచ్చిన జస్టిస్ జోయ్ మల్య బాగ్చి నేడు ప్రమాణస్వీకారం చేశారు. సీనియారిటీ పరంగా జస్టిస్ బాగ్చి ఏపీ హైకోర్టులో రెండో స్థానంలో కొనసాగుతారు.

ఇవాళ కోర్టు చాంబర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేకే మహేశ్వరి జస్టిస్ జోయ్ మల్య బాగ్చితో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులతో పాటు హైకోర్టు ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. బాగ్చితో కలిపి ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 19గా ఉంది. ఇటీవలే జస్టిస్ రాకేశ్ కుమార్ పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే.

జస్టిస్ బాగ్చి 1991లో న్యాయవాదిగా కలకత్తా హైకోర్టులో తన ప్రస్థానం ఆరంభించారు. హైకోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ అనేక వివాదాస్పద కేసుల్లో ఆయన పదునైన వాదనలు వినిపించారు. న్యాయమూర్తిగానూ తన విజ్ఞత చాటుకున్నారు.

ఇక, ఏపీ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియమితుడైన జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ఈ నెల 6న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రస్తుత సీజే జేకే మహేశ్వరి సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వెళుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఆయనకు ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు వీడ్కోలు పలకనున్నారు.
Justice Joymalya Bagchi
Judge
AP High Court
Calcutta High Court

More Telugu News