Jessy Prashanti: పోలీస్ డ్యూటీ మీట్ లో అరుదైన దృశ్యం... కుమార్తెను చూసి గర్వంగా సెల్యూట్ చేసిన సీఐ!

CI salutes his daughter who is a DSP
  • తిరుపతిలో పోలీస్ డ్యూటీ మీట్
  • డీఎస్పీ హోదాలో వచ్చిన జెస్సీ ప్రశాంతి
  • జెస్సీకి సెల్యూట్ చేసిన తండ్రి శ్యాంసుందర్
  • సీఐగా పనిచేస్తున్న శ్యాంసుందర్
  • ఇద్దరినీ అభినందించిన అర్బన్ ఎస్పీ రమేశ్ రెడ్డి
తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో పోలీస్ డ్యూటీ మీట్ సందర్భంగా అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. డీఎస్పీగా పనిచేస్తున్న కుమార్తెను చూసి సీఐగా ఉన్న ఓ తండ్రి గర్వంగా సెల్యూట్ చేశారు. తిరుపతికి చెందిన శ్యాంసుందర్ ప్రస్తుతం చిత్తూరు జిల్లా కల్యాణి డ్యామ్ పోలీసు శిక్షణ కళాశాలలో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుమార్తె జెస్సీ ప్రశాంతి గుంటూరు డీఎస్పీ. రెండేళ్ల కిందట పోలీస్ డిపార్ట్ మెంట్ లో చేరిన ఆమె గుంటూరు అర్బన్ సౌత్ డీఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ ఇద్దరూ కూడా పోలీస్ డ్యూటీ మీట్ సన్నాహాల్లో దర్శనమిచ్చి అందరినీ ఆకర్షించారు.

కుమార్తె డీఎస్పీ కావడంతో ఆమెను తన పై అధికారిణిగా గుర్తించి తండ్రి సెల్యూట్ చేయడం అందరినీ అలరించింది. తండ్రి తనకు సెల్యూట్ చేయడంతో డీఎస్పీ హోదాలో ఉన్న జెస్సీ ప్రశాంతి తిరిగి సెల్యూట్ చేశారు. మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ ఈ దృశ్యం తాలూకు ఫొటోలు సందడి చేస్తున్నాయి. ఆ సమయంలో అక్కడే ఉన్న తిరుపతి అర్బన్ ఎస్పీ రమేశ్ రెడ్డి విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. కుమార్తెను డీఎస్పీ హోదాలో నిలిపిన సీఐ శ్యాంసుందర్ ను అభినందించారు. ఓ మహిళ అయినా పోలీసు ఉద్యోగంలో ఉన్నతస్థాయికి చేరిన జెస్సీని కొనియాడారు.
Jessy Prashanti
Shyam Sundar
Salute
Police Duty Meet
Tirupati
Andhra Pradesh

More Telugu News