Guntur District: ఉలిక్కిపడిన పల్నాడు.. టీడీపీ నేత దారుణ హత్య

TDP Leader killed in Guntur dist
షార్ట్స్‌లో చూడండి
పల్నాడులో టీడీపీకి చెందిన మరో కీలక నేత దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన గొంతు కోసి హతమార్చారు. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్, టీడీపీ కీలక నేత పురంశెట్టి అంకులు (65)కు నిన్న సాయంత్రం ఓ ఫోన్ కాల్ రావడంతో రాత్రి ఏడు గంటల సమయంలో ఒంటరిగా దాచేపల్లి వెళ్లారు. కారును రోడ్డుపై పార్క్ చేసి నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ పైకి వెళ్లారు. ఆ తర్వాత కాసేపటికే మొదటి అంతస్తులో హత్యకు గురయ్యారు. పైకి వెళ్లిన అంకులు ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చిన డ్రైవర్ పైకి వెళ్లి చూడగా, అక్కడ రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించారు.

విషయం తెలిసిన టీడీపీ నేతలు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. హత్యను నిరసిస్తూ అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై రాస్తారోకోకు దిగారు. గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్కడికి చేరుకుని హత్యపై ఆరాతీశారు. వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి, పెదగార్లపాడు వైసీపీ నేతలు, పోలీసుల ప్రోద్బలంతోనే హత్య జరిగిందని ఆరోపించారు. మరోవైపు, హత్య సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అంకులు ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కారు డ్రైవర్ సహా పలువురిని విచారిస్తున్నారు.

పెదగార్లపాడుకు చెందిన అంకులు పదేళ్లపాటు సర్పంచ్‌గా పనిచేశారు. ఆయన భార్య పున్నమ్మ కూడా సర్పంచ్‌గా పనిచేయగా, కుమారుడు పరంజ్యోతి ఎంపీటీసీ సభ్యుడిగా పనిచేశారు.
Go Back to Shorts
Guntur District
Dachepalli
TDP
Murder
YSRCP

More Telugu News