Janasena: ఈ నెల 5న జనసేన-బీజేపీ రామతీర్థ ధర్మయాత్ర

  • రామతీర్థం ఘటనను ఖండించిన జనసేన-బీజేపీ
  • జగన్ సర్కారు చోద్యం చూస్తోందని విమర్శలు
  • ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ధర్మయాత్ర
  • అందరూ భాగస్వాములవ్వాలని పిలుపు
Janasena and BJP will conduct Dharma Yatra

ఏపీలో హిందూ దేవతల విగ్రహాలు, ఆలయ ఆస్తులపై వరుసగా జరుగుతున్న దాడులను నిరసిస్తూ రామతీర్థ ధర్మయాత్ర చేపట్టాలని జనసేన, బీజేపీ నిర్ణయించాయి. ఈ నెల 5న జనసేన, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు యాత్రగా తరలి వెళ్లి రామతీర్థం ఆలయాన్ని సందర్శిస్తారు.

రామతీర్థం క్షేత్రంలో కోదండరామస్వామి విగ్రహం శిరస్సు నరికివేయడం, ఈ దుస్సంఘటన తర్వాత కూడా వరుసగా ఘటనలు జరుగుతున్నాయని జనసేన ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ పరిణామాలను జనసేన, బీజేపీ ఖండిస్తున్నాయని పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ పేరిట విడుదలైన ఓ ప్రకటనలో తెలిపారు.

రామతీర్థం ఘటనకు ముందు నుంచే పలు ఆలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేశారని, రథాన్ని దగ్ధం చేశారని, అయితే ఈ దాడులపై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబించకపోవడాన్ని నిరసిస్తూ రామతీర్థ ధర్మ యాత్ర చేపడుతున్నట్టు వివరించారు. ఈ యాత్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 5వ తేదీ ఉదయం 11 గంటలకు ఈ ధర్మయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు.

"శతాబ్దాల చరిత్ర కలిగిన రామతీర్థంలో బాధాకరమైన ఘటన జరిగితే రాష్ట్ర ప్రభుత్వ స్పందన అత్యంత ఉదాసీనంగా ఉంది. ఎంతో సున్నితమైన అంశంలో జగన్ రెడ్డి ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉంది. దేవాదాయ శాఖ మంత్రి ఉన్నట్టా? లేనట్టా? మంత్రులెవ్వరూ బాధ్యతతో వ్యవహరించడంలేదు" అంటూ ఆ ప్రకటనలో విమర్శలు చేశారు.

More Telugu News