COVID19: కొత్త స్ట్రెయిన్​ ‘ఆర్​’ నెంబర్ తేడా వల్లే వేగంగా వ్యాప్తి.. 20 ఏళ్ల లోపు వారికే ఎక్కువ సోకే ఛాన్స్!

  • పాత వైరస్ తో పోలిస్తే 0.7 దాకా పెరిగిన ప్రత్యుత్పత్తి రేటు
  • 1.1 నుంచి 1.3 మధ్య ఉండొచ్చన్న ఇంపీరియల్ కాలేజ్ శాస్త్రవేత్తలు
  • చాలా వేగంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే ముప్పు
Covid 19 New variant raises R number

బ్రిటన్ లో రూపు మార్చుకున్న కరోనా.. వేగంగా వ్యాపిస్తోందని అది వెలుగు చూసినప్పటి నుంచి సైంటిస్టులు చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా అది ఎంత వేగంగా వ్యాపిస్తోందో పరిశోధన చేసి చెప్పారు లండన్ ఇంపీరియల్ కాలేజీ శాస్త్రవేత్తలు. వైరస్ స్ట్రెయిన్ ప్రత్యుత్పత్తి రేటు (ఆర్ వాల్యూ)పై పరిశోధన చేశారు. మామూలు వైరస్ తో పోలిస్తే రూపం మార్చుకున్న కొత్త రకం కరోనా ప్రత్యుత్పత్తి రేటు 0.7 దాకా పెరిగినట్టు తేల్చారు.

 కొత్త స్ట్రెయిన్ ఆర్ వాల్యూ 1.1 నుంచి 1.4 మధ్య ఉందని, దానిని 1 కన్నా తక్కువకు తీసుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆర్ నంబర్ అనేది కరోనా సోకిన ఒక వ్యక్తి నుంచి సరాసరిన ఎంతమందికి మళ్లీ అది సోకుతోందనేది తెలియజేస్తుంది. పాత వైరస్, కొత్త స్ట్రెయిన్ మధ్య ఆర్ విలువ అంతరం చాలా ఎక్కువగా ఉందని ప్రొఫెసర్ ఏక్సెల్ గ్యాండీ చెప్పారు. కాబట్టి కొత్త స్ట్రెయిన్ చాలా వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

నవంబర్ నెలలో బ్రిటన్ లాక్ డౌన్ పెట్టినా స్ట్రెయిన్ వ్యాప్తి మూడు రెట్లు పెరిగిందని శాస్త్రవేత్తలు గుర్తు చేశారు. అదే సమయంలో పాత వైరస్ వ్యాప్తి మూడు రెట్లు తగ్గిందన్నారు. 20 ఏళ్ల లోపున్న వారిలోనే కొత్త స్ట్రెయిన్ చాలా స్పీడుగా వ్యాపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. బడికెళ్లే చిన్నారుల్లోనూ అధికంగా విస్తరిస్తోందని హెచ్చరించారు. నవంబర్ లో పాఠశాలలు తెరవడం వల్లే యువతకు కొత్త కరోనా ముప్పు పెరిగిందని చెప్పారు.

More Telugu News