హోట‌ల్ లో లంచ్ చేసిన భార‌త క్రికెట‌ర్లు.. వారికి తెలియ‌కుండా బిల్లు చెల్లించిన‌ అభిమాని!

02-01-2021 Sat 13:44
  • ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో ఘ‌ట‌న‌
  • రోహిత్ శర్మ‌,   పంత్‌, శుభ్ మ‌న్ గిల్‌, నవదీప్ సైని లకు ఎదురైన‌ అనుభ‌వం
  • బిల్లును పోస్ట్ చేసిన అభిమాని
fan pays team india lunch bill

టీమిండియా ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అక్క‌డి ఓ హోట‌ల్ లో భోజ‌నం చేసిన న‌లుగురు భార‌త క్రికెట‌ర్లు బిల్ చెల్లించేందుకు వెళ్లారు. అయితే, వారి బిల్లుని అప్పటికే ఓ వ్య‌క్తి చెల్లించి వెళ్లిపోయాడ‌ని అక్క‌డి సిబ్బంది చెప్పారు. దీంతో బిల్లు చెల్లించి క‌నీసం ముఖం కూడా చూపించ‌కుండా వెళ్లిపోయిన ఆ వ్య‌క్తి గురించి తెలుసుకుని భార‌త క్రికెట‌ర్లు ఆశ్చ‌ర్య‌పోయారు.

మెల్‌బోర్న్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన‌ రోహిత్ శర్మ‌, రిష‌భ్‌ పంత్‌, శుభ్ మ‌న్ గిల్‌, న‌వ‌దీప్ సైని లకు ఈ అనుభ‌వం ఎదురైంది. నవల్దీప్ సింగ్ అనే టీమిండియా అభిమాని త‌మ బిల్లును చెల్లించి వెళ్లాడ‌ని భార‌త క్రికెట‌ర్లు నలుగురూ తెలుసుకున్నారు. ఆ న‌లుగురు క్రికెట‌ర్లు తాను కూర్చున్న టేబుల్ ముందే కూర్చోవ‌డంతో నవల్దీప్ సింగ్ తెగ సంబ‌ర‌ప‌డిపోయి ర‌హస్యంగా వారి లంచ్ బిల్లును చెల్లించేశాడు. తాను బిల్లును చెల్లించినట్లు క్రికెట‌ర్ల‌కు తెలియదంటూ న‌వ‌ల్దీప్ కూడా ట్వీట్ చేశాడు. అందుకు సంబంధించిన వీడియోను, ఫొటోల‌ను పోస్ట్ చేశాడు.