Chandrababu: రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు.. లారీలే కాదు జగన్ అడ్డంగా పడుకున్నా చంద్రబాబు పర్యటనను అడ్డుకోలేడన్న లోకేశ్!

Police blocked road with lorries during Chandrababu Rama Theertham visit
  • చంద్రబాబు రామతీర్థం పర్యటనకు అడ్డంకులు
  • ఇతర టీడీపీ నేతల వాహనాలు వెళ్లకుండా లారీలు అడ్డం పెట్టిన పోలీసులు
  • జగన్, పోలీసులు కలిసి చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటున్నారన్న లోకేశ్
టీడీపీ అధినేత చంద్రబాబు రామతీర్థం పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కేవలం చంద్రబాబు కాన్వాయ్ కి మాత్రమే అనుమతి ఇచ్చిన పోలీసులు... ఇతర టీడీపీ నేతల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. లారీలను రోడ్డుకు అడ్డంగా పెట్టి వాహనాలను నిలువరించారు. దీంతో, చంద్రబాబు రోడ్డుపైనే బైఠాయించారు. తమ నేతల వాహనాలను అనుమతించాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు కూడా దీనిపై మండిపడ్డారు. చంద్రబాబుతో కలిసి తమను వెళ్లనివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి ఎందుకంత భయం అని ప్రశ్నించారు.

మరోవైపు రోడ్డుకు లారీలను అడ్డుపెట్టడంపై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. తమ అధినేత పర్యటనను అడ్డుకోవడానికి లారీలను అడ్డుగా పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. గతంలో ప్రతిపక్ష నేత ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా గేటుకి తాళ్లు కట్టారని... ఇప్పుడు ఏకంగా లారీలు అడ్డంగా పెట్టారని దుయ్యబట్టారు. లారీలే కాదు, జగన్ రెడ్డే అడ్డంగా పడుకున్నా చంద్రబాబు రామతీర్థం పర్యటనను అడ్డుకోలేరని ఎద్దేవా చేశారు. హిందూ ధర్మంపై జరుగుతున్న దాడిని అడ్డుకోలేని జగన్, విగ్రహాల ధ్వంసాన్ని అడ్డుకోలేని పోలీసులు కలిసి చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటున్నారని... ఈ చర్యలను ఖండిస్తున్నానని అన్నారు.
Chandrababu
Nara Lokesh
Telugudesam
Rama Theertham
Jagan
YSRCP

More Telugu News