Farmers Protest: షాపింగ్​ మాళ్లు బంద్​ చేయిస్తాం.. పెట్రోల్​ బంకులు మూసేయిస్తాం: రైతు సంఘాల హెచ్చరిక

  • వ్యవసాయ చట్టాలను రద్దు చేసి తీరాల్సిందే
  • కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాల్సిందే
  • ఆందోళనలు మరింత తీవ్రమవుతాయని హెచ్చరిక
  • జనవరి 4న చర్చలు విఫలమైతే 6న ట్రాక్టర్ ర్యాలీకి నిర్ణయం
Will shut malls and petrol pumps if Jan 4 talks fail warn farmers

కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోయినా, కనీస మద్దతు ధరకు చట్టబద్ధతను కల్పించకపోయినా ఆందోళనను తీవ్రతరం చేస్తామని రైతు సంఘాల నేతలు హెచ్చరించారు. జనవరి 4న జరగబోయే సమావేశంలో తమ డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పుకుని తీరాల్సిందేనని స్పష్టం చేశారు. బుధవారం నాటి ఆరో రౌండ్ చర్చల్లో పంట వ్యర్థాల కాల్చివేతలపై పెనాల్టీలు, విద్యుత్ బిల్లుల పెంపుపై రైతు సంఘాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య సయోధ్య కుదిరింది. ఇప్పుడు ఆ రెండు డిమాండ్లపైనా రైతులు పట్టుబడుతున్నారు.

ఇప్పటిదాకా తాము లేవనెత్తిన డిమాండ్లలో కేవలం ఐదు శాతం మాత్రమే కేంద్ర ప్రభుత్వం నెరవేర్చిందని సింఘూ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు తెలిపారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే అన్ని షాపింగ్ మాళ్లు, పెట్రోల్ బంకులను బంద్ చేయిస్తామని హెచ్చరించారు. ‘‘షాహీన్ బాగ్ లాగానే రైతుల ఆందోళనలకూ తెర పడుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్టుంది. కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా ఢిల్లీ సరిహద్దుల నుంచి కదిలేది లేదు. మమ్మల్ని పంపలేరు’’ అని రైతు సంఘం నేత యుధ్ వీర్ సింగ్ అన్నారు.

కార్పొరేట్ మద్దతుదారులంతా రాజీ పడాలంటూ సందేశాలిస్తున్నారని ఆలిండియన్ కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ (ఏఐకేఎస్సీసీ) మండిపడింది. వ్యవసాయ మార్కెట్లు, పంటలు, రైతుల భూములు, ఆహార భద్రతను కార్పొరేట్లకు అప్పగించే మూడు చట్టాలను రద్దు చేసే వరకు రైతులెవరూ అక్కడి నుంచి కదలరని తేల్చి చెప్పింది. కేంద్రం కేవలం రెండు చిన్న సమస్యలను తీర్చేందుకు ఒప్పుకుని పెద్ద సమస్యలను మరుగున పడేసే ప్రయత్నం చేస్తోందన్నారు.

మరోవైపు ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న 40 రైతు సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంయుక్త్ కిసాన్ మోర్చా మరోసారి సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. సోమవారం జరగబోయే చర్చల్లో అనుకున్న ఫలితాలు రాకపోతే జనవరి 6న కుండలి–మనేసార్–పల్వాల్ ఎక్స్ ప్రెస్ వేపై ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించింది. అంతేగాకుండా హర్యానా– రాజస్థాన్ సరిహద్దుల్లోని షాజహాన్ పూర్ వద్ద ఆందోళన చేస్తున్న అక్కడి రైతులను.. ఢిల్లీ వైపు కదిలి రావాల్సిందిగా పిలుపునివ్వబోతున్నారు.

More Telugu News