Etela Rajender: రోజుకు 10 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం: ఈటల రాజేందర్

  • తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతున్నాయి
  • బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో కొందరికి కరోనా నిర్ధారణ అయింది
  • వ్యాక్సిన్ వేసేందుకు 10 వేల మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చాం
Planning to give 10 laks vaccines everyday says Etela Rajender

కరోనా వ్యాక్సిన్ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ డ్రైరన్ నిర్వహించారు. తెలంగాణలో రేపు డ్రైరన్ నిర్వహించనున్నారు. హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలలో డ్రైరన్ జరగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ, డ్రైరన్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు.

కరోనా వ్యాక్సిన్ రాబోతోందని కేంద్ర ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసిన వెంటనే... తాము దానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు 10 వేల మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చి, సిద్ధంగా ఉంచామని తెలిపారు. ప్రతిరోజు 10 లక్షల మందికి వ్యాక్సిన్ వేసేలా ప్రణాళిక రూపొందించామని చెప్పారు.

తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఈటల రాజేందర్ తెలిపారు. రాష్ట్రంలో సెకండ్ వేవ్ అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని చెప్పారు. బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చిన వారిలో కొందరికి కరోనా నిర్థారణ అయిందని... కరోనా కొత్త స్ట్రెయిన్ కోసం వారి నమూనాలను పూణె వైరాలజీ ల్యాబ్ కు పంపించామని తెలిపారు. రాష్ట్రాన్ని కరోనా రహితంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

More Telugu News