India: అణు కేంద్రాల జాబితాలను ఇచ్చిపుచ్చుకున్న ఇండియా, పాకిస్థాన్

  • గత 30 ఏళ్లుగా కొనసాగుతున్న ప్రకియ
  • 1991 జనవరిలో అమల్లోకి వచ్చిన ఒప్పందం
  • అణు కేంద్రాలు ఉన్న ప్రాంతాలపై దాడి చేయకూడదని ఒప్పందం
India and Pakistan Exchange List Of Nuclear Installations

తమ దేశాల్లో ఉన్న అణు స్థావరాలు, అణుశక్తి ఆధారిత కేంద్రాల జాబితాను భారత్, పాకిస్థాన్ లు ఇచ్చిపుచ్చుకున్నాయి. గత 30 ఏళ్లుగా కొనసాగుతున్న ప్రక్రియను ఈ ఏడాది కూడా కొనసాగించాయి. అణు స్థావరాలపై దాడులు చేసుకోకుండా ఉండటం కోసం ఇరు దేశాలు వాటి వివరాలను ప్రతి ఏటా ఇచ్చిపుచ్చుకుంటాయి. దౌత్య వర్గాల ద్వారా న్యూఢిల్లీ, ఇస్లామాబాద్ లలో ఇరు దేశాలు తమ వివరాలను అందించాయి. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.  

యుద్ధ సమయాల్లో కూడా అణుస్థావరాలు, అణు ఆధారిత కేంద్రాలు ఉన్న ప్రాంతాలపై దాడి చేయకుండా ఉండేందుకు ఈ మేరకు ఇరు దేశాల మధ్య 1988 డిసెంబర్ 31న ఒప్పందం కుదిరింది. 1991 జనవరి 27 నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఒప్పందం ప్రకారం ప్రతి ఏటా జనవరి 1వ తేదీన అణు సంబంధిత సమాచారాన్ని రెండు దేశాలు ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. ఒప్పందం ప్రకారం జాబితాలోని స్థావరాలపై దాడి చేయకూడదు.

More Telugu News