నితిన్ కొత్త సినిమా సంక్రాంతికి లేదట!

01-01-2021 Fri 17:23
  • ఇటీవలే మళ్లీ తెరుచుకున్న థియేటర్లు 
  • అడ్డంకిగా ఏభై శాతం ఆక్యుపెన్సీ నిబంధన  
  • నితిన్ 'రంగ్ దే' మార్చ్ 26కి వాయిదా  
Nitin movie postponed further
కరోనా కారణంగా కొన్ని నెలల పాటు మూతబడ్డ సినిమా హాళ్లు ఇటీవలే తెరుచుకున్నాయి. నిబంధనలను పక్కాగా పాటిస్తూ థియేటర్లను తెరుచుకోవచ్చని ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో చాలా ఊళ్లలో ఓపెన్ అయ్యాయి. అయితే, ఏభై శాతం ఆక్యుపెన్సీ మాత్రమే వుండాలని నిబంధన విధించడంతో కొందరు నిర్మాతలు తమ తమ సినిమాలను విడుదల చేయడానికి వెనుకంజ వేస్తున్నారు.

ఈ క్రమంలో నితిన్ నటించిన కొత్త సినిమా విడుదల కూడా వాయిదాపడుతోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందిన 'రంగ్ దే' సినిమా ఇప్పటికే పూర్తయింది. సంక్రాంతికి విడుదల చేయడానికి నిర్మాతలు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే, ఏభై శాతం ఆక్యుపెన్సీ నిబంధన వల్ల రిస్క్ అవుతుందని ఇప్పుడు భావిస్తున్నారట.

దీంతో తమ సినిమా విడుదలను వాయిదా వేసుకుని, మార్చ్ 26న రిలీజ్ చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆ సమయానికి వంద శాతం ఆక్యుపెన్సీకి అనుమతినిస్తారని ఆశిస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ సరసన కీర్తి సురేశ్ కథానాయికగా నటించింది.