Narendra Bull Kumar: సియాచిన్ కు వెళ్లేందుకు దారి చూపిన హీరో... కల్నల్ నరేంద్ర కుమార్ కన్నుమూత!

Siachin Hero Colnul Narendra Kumar Passes Away
  • 1933లో పాకిస్థాన్ ప్రాంతంలో జన్మించిన నరేంద్ర కుమార్
  • 1984లో సియాచిన్ కు తొలిసారిగా సైన్యాన్ని తీసుకెళ్లిన నరేంద్ర
  • సంతాపం వెలిబుచ్చిన పలువురు సైన్యాధికారులు
భారత సరిహద్దుల్లో హిమాలయాల పర్వత సానువుల్లో అత్యంత కీలకమైన ప్రాంతంగా ఉన్న సియాచిన్ గ్లేసియర్ కు తొలిసారిగా వెళ్లిన కల్నల్ నరేంద్ర 'బుల్' కుమార్ (రిటైర్డ్) 2020 సంవత్సరం ఆఖరు రోజున కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన పరిస్థితి విషమించి మరణించారని కుటుంబీకులు తెలిపారు.

 భారత జవాన్లు తొలిసారిగా సియాచిన్ కు వెళ్లారంటే, అందుకు కారణం నరేంద్ర కుమారే. 1933లో ప్రస్తుతం పాకిస్థాన్ పరిధిలో ఉన్న రావల్పిండిలో జన్మించిన నరేంద్ర కుమార్, పర్వతారోహణలో సిద్ధహస్తుడు. ఓ టీమ్ ను తీసుకుని ఏప్రిల్ 1984లో అత్యంత క్లిష్టమైన సియాచిన్ గ్లేసియర్ కు చేరుకున్నారు. ఆయన సాహసం తదుపరి చేబట్టిన ఆపరేషన్ మేఘదూత్ విజయవంతం అయ్యేందుకు ఎంతో సహకరించింది.

ఇటీవల మీడియాకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన నరేంద్ర కుమార్, "మేము నాటి మా ప్రయత్నాన్ని విజయవంతం చేసేందుకు ఎంతో కష్టపడ్డాము. మాకు అడుగడుగునా పాకిస్థాన్ సైన్యం అడ్డు పడేది. మేము వెళుతున్న మార్గంలో రంగుల పొగను వెదజల్లుతూ వెళ్లాము. ఆ సమయంలో మా వద్ద ఆయుధాలు లేవు. దీంతో కొంత భయంగానే మా ప్రయాణం సాగింది" అని నాటి రోజులను గుర్తు చేసుకున్నారు.

ఆ తరువాత సియాచిన్ గ్లేసియర్ పక్కనే ఉన్న మరో ఎత్తయిన ప్రాంతమైన సాల్టోరో ప్రాంతంపైనా భారత్ పట్టు సాధించింది. ఇంకా చెప్పాలంటే, సాల్టోరో రేంజ్ ఎవరి అధీనంలో ఉంటుందో, వారికే సియాచిన్ పై పట్టు లభిస్తుంది. పశ్చిమాన పాకిస్థాన్, తూర్పున చైనా దేశాల సరిహద్దుల మధ్య ఉండే ఈ ప్రాంతం ప్రస్తుతం ఇండియా అధీనంలోనే ఉందంటే, నాటి నరేంద్ర కుమార్ చలవేనని చెప్పవచ్చు.

సియాచిన్ కు వెళ్లే ముందు 1978లో ప్రపంచంలోని మూడవ అతిపెద్ద పర్వతమైన కాంచనగంగను నరేంద్ర కుమార్ అధిరోహించారు. ఆయన సాధించిన ఘనతలను భావి తరాలకు తెలిపేలా భారత ప్రభుత్వం ప్రత్యేక పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేసింది. నరేంద్ర కుమార్ మృతిపట్ల పలువురు సైన్యాధికారులు, ప్రముఖులు తమ సంతాపాన్ని వెలిబుచ్చారు.
Narendra Bull Kumar
Siachin
Passes Away

More Telugu News