China: హిందూ మహాసముద్రంలో అండర్ వాటర్ డ్రోన్లు మోహరించిన చైనా

  • సీ వింగ్ గ్లైడర్లను రంగంలోకి దించిన చైనా
  • గతేడాది డిసెంబరులో ప్రయోగం
  • ఫిబ్రవరిలో ఉపసంహరణ
  • కీలక సమాచారం సేకరించిన చైనా!
China deploys underwater drone in Indian Ocean

చైనా కుయుక్తుల్లో మరో ఉదంతం వెల్లడైంది. హిందూ మహాసముద్రంలో నౌకల కదలికలపై నిఘా వేసేందుకు చైనా అండర్ వాటర్ డ్రోన్లను మోహరించినట్టు వెల్లడైంది. ఈ మానవరహిత డ్రోన్లు జలాంతర్భాగంలో పయనిస్తూ నౌకలపై నిఘా వేసి ఉంచుతాయి. వీటిని సీ వింగ్ (హైయీ) అని పిలుస్తారు. ఈ అండర్ వాటర్ డ్రోన్లు నెలల తరబడి సముద్రాల్లోనే ఉంటాయి.

వీటిని చైనా గతేడాది డిసెంబరులో హిందూ మహాసముద్రంలో ప్రవేశపెట్టిందని, ఈ ఫిబ్రవరిలో వీటిని ఉపసంహరించుకుందని హై సట్టన్ అనే రక్షణ రంగ విశ్లేషకుడు వివరించారు. అప్పటికే అవి 3,400 కదలికలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాయని తెలిపారు. ఈ సీ వింగ్ గ్లైడర్లు అమెరికా వద్ద ఉన్న అండర్ వాటర్ డ్రోన్ల తరహాలోనే ఉంటాయని హై సట్టన్ పేర్కొన్నారు. 2016లో అమెరికాకు చెందిన ఒక అండర్ వాటర్ డ్రోన్ ను చైనా స్వాధీనం చేసుకుంది.

గత కొంతకాలంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంపై పట్టు పెంచుకునేందుకు చైనా ప్రయత్నిస్తోంది. ఇక్కడ భారత్ ఆధిపత్యాన్ని భరించలేకపోతున్న చైనా.... భారత్ కు మిత్రపక్షాలుగా మారిన అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ నావికా దళాలపై ఓ కన్నేసేందుకు ఈ సీ వింగ్ అండర్ వాటర్ డ్రోన్లను మోహరించినట్టు రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు.

More Telugu News