KCR: తెలంగాణలో వ్యవసాయ భూముల క్రయవిక్రయాలపై సీఎం కేసీఆర్ నిర్ణయాలు ఇవిగో!

  • ధరణి పోర్టల్ నేపథ్యంలో సమీక్ష సమావేశం
  • అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సీఎం
  • ధరణి పోర్టల్ మెరుగైన ఫలితాలు సాధిస్తోందని వెల్లడి
  • మరిన్ని ఆప్షన్లు ఏర్పాటు చేయాలని స్పష్టీకరణ
CM KCR reviews Dharani Portal in Pragathi Bhavan

రాష్ట్రంలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ నిమిత్తం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ లో మరిన్ని ఆప్షన్లు చేర్చి, మరింత మెరుగైన సేవలు అందించడంపై సీఎం కేసీఆర్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ ప్రగతి భవన్ లో నిర్వహించిన ఈ విస్తృతస్థాయి సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు ప్రకటించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ధరణి పోర్టల్ ను తీసుకువచ్చామని, తాము ఆశించిన విధంగానే ధరణి పోర్టల్ మెరుగైన ఫలితాలు సాధిస్తోందని హర్షం వ్యక్తం చేశారు.

రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, ఎవరి వద్దా పైరవీలు చేసుకోవాల్సిన దుస్థితి కలగకుండా నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరుగుతున్నాయని తెలిపారు. కేవలం రెండు నెలల కాలంలోనే 1.06 వేలమంది ధరణి పోర్టల్ ద్వారా స్లాట్ బుక్ చేసుకున్నారని, వారిలో 80 వేల మంది రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకున్నారని వివరించారు. వ్యవసాయ భూముల విషయంలో నెలకొన్న చిన్నపాటి సందిగ్ధతలను జిల్లా కలెక్టర్లు రెండు నెలల వ్యవధిలో పరిష్కరిస్తారని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో కేసీఆర్ ప్రకటించిన కీలక నిర్ణయాలు ఇవే...

  • ధరణిలో స్లాట్ బుక్ కాకపోతే ఎందుకు కావడంలేదన్న విషయం దరఖాస్తుదారుడికి తెలిపే విధంగా ఆప్షన్ ఉండాలి.
  • స్లాట్ బుక్ చేసుకునే సమయంలో వివరాలు తప్పుగా నమోదైతే బుక్ చేసుకున్న చోటే వాటిని సవరించుకునేందుకు రిజిస్ట్రేషన్ కన్నా ముందు అవకాశం కల్పించాలి.
  • చట్టబద్ధ వారసుల పేర్లను రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో అనుమతిదారుల కేటగిరీ కింద నమోదు చేసుకునే ఆప్షన్ ఏర్పాటు చేయాలి.
  • ధరణి పోర్టల్ రాకకు పూర్వం రిజిస్ట్రేషన్ అయిన భూములను రిజిస్టర్డ్ డాక్యుమెంట్ల ఆధారంగా కొన్నవారి పేరిట జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో మ్యుటేషన్ చేయాలి. అందుకోసం మీ సేవ ద్వారా మ్యుటేషన్ దరఖాస్తులు స్వీకరించి, స్లాట్లు కేటాయించాలి.
  • ప్రభుత్వం అసైన్డ్ చేసిన భూములు అనుభవిస్తున్న రైతులు మరణిస్తే వారి చట్టబద్ధ వారసులకు ఆ భూములు బదలాయించాలి.
  • మైనర్ల పేరిట భూములు రిజిస్ట్రేషన్ చేసే సమయంలో మైనర్లు, వారి సంరక్షకుల పేరిట పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వాలి.
  • ఇనామ్ భూములు సాగుచేసుకుంటున్న హక్కుదారులకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు అందజేయాలి. ఆ వివరాలను ధరణి పోర్టల్ లో నమోదు చేయాలి.
  • ప్రభుత్వ భూములు, చెరువు ఎఫ్ టీఎల్ భూములు, దేవాదాయ, వక్ఫ్ భూములు, అటవీ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు వ్యక్తులకు రిజిస్టర్ చేయరాదు.
  • పట్టాదారు పాసుపుస్తకాలు పోయినట్టయితే వాటి స్థానంలో ట్రూ కాపీ తీసుకునే వెసులుబాటు ఇవ్వాలి.
  • ఈసీ, మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్లను ఆన్ లైన్ లో ప్రింట్ తీసుకునే సదుపాయం కల్పించాలి.
  • ఏవైనా అనివార్య కారణాల వల్ల స్లాట్ బుక్ చేసుకున్న రోజున రాలేకపోయిన వారు ఆ స్లాట్ రద్దు చేసుకుని, మరో రోజు స్లాట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించాలి. స్లాట్ పూర్తిగా రద్దు చేసుకుంటే డబ్బులు తిరిగివ్వాలి.
  • వ్యవసాయ భూముల లీజు డీడ్, ఎక్చేంజి డీడ్ ల రిజిస్ట్రేషన్లకు ధరణిలో అవకాశం కల్పించాలి.
  • వ్యవసాయ భూముల్లో నెలకొల్పే ఫర్మ్ లు, కంపెనీలు, వివిధ సంస్థలు ఆ భూములు అమ్ముకునేందుకు, కొనుక్కునేందుకు ధరణి పోర్టల్ ద్వారా తక్షణ అవకాశం కల్పించాలి.
  • పాస్ పోర్టు నెంబరు నమోదు చేసుకుని ఎన్నారైల భూములు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కల్పించాలి.
  • సరిహద్దు వివాదాలున్న చోట జిల్లా కలెక్టర్లు సర్వే చేపట్టి హద్దులు నిర్ణయించాలి.
  • కోర్టు విచారణలో ఉన్న భూములు మినహాయించి, భూ రికార్డుల సమగ్ర సర్వే సందర్భంగా పార్ట్-బీలో ఉంచిన వ్యవసాయ భూములకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే కలెక్టర్లు 60 రోజుల్లోగా పరిష్కరించాలి.
  • రెవెన్యూ కోర్టుల్లో ఉన్న వివాదాలను పరిష్కరించడానికి జిల్లాకు ఒకటి చొప్పన కలెక్టర్ల ఆధ్వర్యంలో ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయాలి.

More Telugu News