Narendra Modi: ‘మందులున్నా.. జాగ్రత్తగా ఉందాం’.. ఇదే మన 2021 నినాదం: ప్రధాని నరేంద్ర మోదీ

Dawai bhi kadaai bhi should be our mantra for 2021 PM Modi says
షార్ట్స్‌లో చూడండి
నూతన సంవత్సరాది సందర్భంగా కరోనా కష్టకాలంలో ముందుండి నడిచిన వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, ఫార్మాసిస్టులు, అధికారులు, ఇతర కరోనా యోధులను ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. వచ్చే ఏడాది మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. కరోనా జాగ్రత్తలను పాటించడం మరవొద్దని, కరోనా కట్టడి కాడి వదిలేయొద్దని చెప్పారు. వ్యాక్సిన్ వేయించుకున్నా కరోనా నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గురువారం గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఎయిమ్స్ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.

‘మందులు లేనంత మాత్రాన.. ఢీలా పడిపోవద్దు’ అంటూ ఇంతకు ముందు చెప్పానని, కానీ, ఇప్పుడు మందులూ ఉన్నాయని, దాంతో పాటు జాగ్రత్తలూ తీసుకోవాలని చెబుతున్నానని అన్నారు. ‘మందులతో పాటు జాగ్రత్తలూ’.. ఇదే 2021కి మన నినాదం కావాలని పిలుపునిచ్చారు. దేశంలో కరోనా వ్యాక్సిన్ల పంపిణీ వ్యవహారం తుది అంకానికి చేరిందన్నారు. మన దేశంలో తయారు చేసిన టీకాలనే ముందుగా ప్రజలకు ఇస్తామన్నారు.

ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు చాలా వరకు తగ్గుముఖం పట్టాయని, కొత్త ఏడాది నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టబోతున్నామని ప్రధాని చెప్పారు. కరోనాతో పోరులో లక్షలాది మంది వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది ఎనలేని సేవలు అందించారన్నారు. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్న విషయాన్ని 2020 మనందరికీ మరోసారి నేర్పిందని గుర్తు చేశారు. పాత ఏడాది మొత్తం సవాళ్లతో కూడుకున్నదేనని, అలాంటి సంవత్సరానికి కొత్త ఎయిమ్స్ తో వీడ్కోలు చెబుతున్నానని అన్నారు.

ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా రూ.30 వేల కోట్ల విలువైన ప్రజా ధనం ఆదా అయిందన్నారు. దేశ వ్యాప్తంగా 7 వేల జన ఔషధి కేంద్రాల ద్వారా 90 శాతం తక్కువ ధరలకే పేద ప్రజలకు మందులు అందిస్తున్నామన్నారు. దాదాపు మూడున్నర లక్షల మంది పేద ప్రజలు వీటి సేవలు వినియోగించుకుంటున్నారని చెప్పారు. ఆరేళ్లలో 10 కొత్త ఎయిమ్స్ లను కేటాయించామని, అందులో ఇప్పటికే కొన్ని అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. 20 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులనూ దేశ వ్యాప్తంగా నిర్మిస్తున్నామన్నారు.
Go Back to Shorts
Narendra Modi
COVID19
Prime Minister

More Telugu News