Ladakh: లడఖ్ కు భారీ మిసైల్స్ ను తరలించిన చైనా!

  • భారీ ఎత్తున ఆయుధాలు తెచ్చిపెట్టింది
  • ఇండియా తరఫున జాగ్రత్తలు తీసుకుంటున్నాం
  • ఎయిర్ చీఫ్ మార్షల్ బహదూరియా
Heavy Missiles Deployed in Borders by china

చైనా వైమానిక దళం భారత సరిహద్దుల్లోని లడఖ్ ప్రాంతానికి భారీ మిసైల్స్ ను, రాడార్లను తరలించడం కలకలం రేపింది. తూర్పు లడఖ్ ప్రాంతానికి చైనా అత్యాధునిక ఆయుధాలను తరలించిందని స్పష్టం చేసిన ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బహదూరియా, భారత్ తరఫున తీసుకోవాల్సిన అన్ని చర్యలూ తీసుకుంటున్నామని, పరిస్థితిని నిత్యమూ సమీక్షిస్తున్నామని వెల్లడించారు.

వివేకానంద్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'నేషనల్ సెక్యూరిటీ చాలెంజస్ అండ్ ఎయిర్ పవర్' అనే అంశంపై జరిగిన వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించిన బహదూరియా, ఎల్ఏసీ (వాస్తవాధీన రేఖ) వెంబడి చైనా జవాన్లకు మద్దతుగా అత్యాధునిక ఆయుధాలు వచ్చి చేరుతున్నాయని అన్నారు. పెద్దఎత్తున రాడార్లు, భూ ఉపరితలం పైనుంచి గాల్లోకి వెళ్లి లక్ష్యాలను ధ్వంసం చేసే మిసైల్స్ ను కూడా మోహరించారని అన్నారు.

చైనా దేశీయంగా అభివృద్ధి చేసిన జే-20, జే-10 యుద్ధ విమానాలు, రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్యూ-30 విమానాలను సైతం సరిహద్దులకు తరలించిందని ఆయన అన్నారు. రష్యా నుంచి తెచ్చిన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను సైతం యాక్టివేట్ చేసిందని ఆయన అన్నారు. ఇదే సమయంలో ఇండియా సైతం ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఫ్రంట్ లైన్ ఫైటర్ జెట్లను సిద్ధంగా ఉంచిందని అన్నారు.

రాఫెల్ తో పాటు మిగ్-29 విమానాలు పలు ఎయిర్ బేస్ లలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ఎలాంటి అనిశ్చిత పరిస్థితి ఏర్పడినా దీటుగా ప్రతిఘటించేందుకు ఇండియా సిద్ధంగా ఉందని అన్నారు. ఇండియా, చైనాల మధ్య నెలకొనే ఎటువంటి ప్రతిష్ఠంభననైనా, ప్రపంచానికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు.

More Telugu News