ramachandra rao: అందుకే ఉద్యోగులకు పదోన్నతులు, కొత్త ఉద్యోగాలు అంటూ ప్రకటనలు చేస్తున్నారు: బీజేపీ నేత రామచంద్రరావు విమర్శలు

ramachandra rao slam kcr
  • ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇటువంటి ప్రకటనలు
  • 2014 నుంచి ఎంత మంది ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు?
  • ఇన్నేళ్లుగా ఉద్యోగులకు ప్రమోషన్లు లేవు
  • దాదాపు 3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపు, పదవీ విరమణ వయసు పొడిగింపు, పదోన్నతులు వంటి ప్రకటనలు చేసిన సీఎం కేసీఆర్‌ తీరుపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని, కొత్త ఉద్యోగాలు కూడా ఇస్తామని చెబుతున్నారని బీజేపీ నేత రామచంద్ర రావు విమర్శించారు.

ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘2014 నుంచి ఇప్పటివరకు ఎంత మంది ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారు? ఇన్నేళ్లుగా ఉద్యోగులకు ప్రమోషన్లు లేవు, కొత్త నియామకాలు లేవు. కేవలం ప్రకటనలు చేస్తూ, మభ్యపెడుతున్నారు. 2014లోనే లక్ష 35 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి’ అని రామచంద్ర రావు అన్నారు.

‘ఇప్పుడు దాదాపు 3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఒక్కరికీ కూడా ఇవ్వలేదు. ఎన్నికల ముందు మళ్లీ మభ్యపెడుతున్నారు. ఎన్నికల ముందు ప్రకటనలు చేసి ఆ తర్వాత ఉద్యోగాల భర్తీ చేయట్లేదు’ అంటూ విమర్శించారు.

‘ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న ఆరు జిల్లాల యువతను ప్రభావితం చేసేందుకే ఉద్యోగాల భర్తీ ప్రకటనలు చేస్తున్నారు. కేవలం ఎన్నికల కోసమే ప్రకటనలు చేస్తున్నారు. ఇచ్చిన హామీలన్నీ మర్చిపోతున్నారు. వర్సిటీల్లో వైస్ చాన్సలర్ల పోస్టులు, పాఠశాలల్లో టీచర్ల పోస్టుల భర్తీ కాలేదు. ఈ పరిస్థితిని తెలంగాణలో తీసుకొచ్చింది టీఆర్ఎస్ సర్కారే. ఇప్పుడు కేసీఆర్ చేస్తోన్న ప్రకటనలను ఉద్యోగస్థులు, యువత నమ్ముతారా?’ అని  రామచంద్ర రావు  ప్రశ్నించారు.
ramachandra rao
BJP
KCR

More Telugu News