Rajnath Singh: రెచ్చగొడితే చూస్తూ ఊరుకుంటామా? బుద్ధి చెప్పే తీరుతాం: రాజ్ నాథ్ సింగ్

  • అన్ని దేశాలతో సత్సంబంధాలే లక్ష్యం
  • ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించబోము
  • మన జవాన్లకు రహస్య దాడుల సత్తా ఉంది
  • మత మార్పిడి వివాహాలకు వ్యక్తిగతంగా వ్యతిరేకం
  • జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్ నాథ్
Defence Minister Rajnath Singh Special Interview

ఇండియాకు సంబంధించినంత వరకూ అన్ని దేశాలతోనూ సత్సంబంధాలను కొనసాగించాలనే కోరుకుంటున్నామని, ఇదే సమయంలో ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేసినా, రెచ్చగొట్టినా, బుద్ధి చెప్పే తీరుతామని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు. ఓ జాతీయ చానెల్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, ఇండియాను రెచ్చగొట్టే వారిని విడిచి పెట్టబోమని, ఏ మాత్రం ఉపేక్షించకుండా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఇండియా వ్యవహారశైలి ఎప్పుడూ సున్నితంగానే ఉంటుందని వ్యాఖ్యానించిన రాజ్ నాథ్ సింగ్, అంతమాత్రాన శత్రువులు రెచ్చిపోయేందుకు అవకాశం ఇచ్చినట్లు కాదని అన్నారు. రెచ్చిపోతే చేతులు ముడుచుకుని కూర్చుంటామని మాత్రం భావించవద్దని, చైనా పేరెత్తకుండా పరోక్ష హెచ్చరికలు చేశారు. భారత సరిహద్దుల్లో కాపలాగా ఉండే జవాన్లకు అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించడంలో వేగవంతంగా స్పందిస్తున్నామని, ఇది ఏ దేశాన్నీ భయపెట్టేందుకు కాదని, అక్కడి ప్రజల సంక్షేమం కోసమే ఈ పనులు చేస్తున్నామని స్పష్టం చేశారు.

కాగా, చైనా సరిహద్దుల్లో ఇటీవలి కాలంలో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను అభివృద్ధి చేసే విషయంలో భారత్ దూకుడుగా వుంది. చైనా సైతం తమ వైపు భారీ ఎత్తున రహదారులు, సైనిక స్థావరాలు, ఎయిర్ బేస్ లను అభివృద్ధి చేస్తోంది. ఇదే సమయంలో పాకిస్థాన్ వీలు చిక్కినప్పుడల్లా ఇండియాలోకి ఉగ్రవాదులను చొప్పిస్తోందని మండిపడిన రాజ్ నాథ్, భారత జవాన్లు వారిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారని, రహస్యంగా శత్రువుల భూభాగాల్లోకి వెళ్లి దాడి చేసే సత్తా మన జవాన్లకూ ఉందని నిరూపితమైందని గుర్తు చేశారు.

భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ ప్రధానుల జోక్యాన్ని కూడా సహించబోమని, వారి జోక్యం కూడా తమకు అవసరం లేదని తేల్చి చెప్పారు. రైతుల ఆందోళనలను ప్రస్తావించిన ఆయన, నిరసన తెలుపుతున్న రైతుల్లో నక్సలైట్లు, ఉగ్రవాదులు ఉన్నారని తాము ఎన్నడూ చెప్పలేదని అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అంశాల వారీగా చర్చిస్తే, ఓ పరిష్కారం లభిస్తుందనే తాను నమ్ముతున్నానని తెలిపారు. అన్నం పెట్టే అన్నదాతలను తాను గౌరవిస్తానని, వారికి కనీస మద్దతు ధర కొనసాగుతుందని, వారి ఆదాయాన్ని రెట్టింపు చేయడమే వ్యవసాయ చట్టాల ముఖ్య ఉద్దేశమని అన్నారు.

జమ్ము కశ్మీర్ ప్రాంతంలో వేర్పాటువాదం, ఉగ్రవాదం ఓడిపోయాయని, ఎన్డీయే తీసుకున్న నిర్ణయాలతో అక్కడ కూడా ప్రజాస్వామ్యం పరిఢవిల్లిందని అన్నారు. ఇండియాలో బలవంతపు మత మార్పిడులు జరుగుతున్నట్టు కనిపిస్తున్నాయని, ప్రేమించిన వారిని పెళ్లాడేందుకు తామెన్నడూ అభ్యంతరాలు తెలియజేయబోమని, కానీ బలవంతంగా మతాన్ని మార్పిస్తే మాత్రం చర్యలుంటాయని అన్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఈ విషయంలో ఆర్డినెన్స్ లను తెచ్చాయని గుర్తుచేశారు. మత మార్పిడి వివాహాలకు తాను వ్యక్తిగతంగా వ్యతిరేకమని రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

More Telugu News