Somireddy Chandra Mohan Reddy: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిలా ఉంది అన్నదాతల పరిస్థితి: సోమిరెడ్డి

  • పెన్నావారధిని సందర్శించిన సోమిరెడ్డి
  • గండ్లు పూడ్చేందుకు ఇంకెంత సమయం కావాలన్న మాజీమంత్రి
  • రైతులంటే లెక్కలేదా? అంటూ సర్కారుపై ఆగ్రహం
  • గాలి మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం
Somireddy visits Penna bridge in Nellore

ఇటీవల నివర్ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు పెన్నా నది పోటెత్తింది. దాంతో నదికి పలు చోట్ల భారీగా గండ్లు పడ్డాయి. అయితే, నెల్లూరులో పెన్నా వారధికి పడిన గండ్లను పూడ్చడానికి ఇంకెంత సమయం తీసుకుంటారని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుల విషయంలో ఇంత నిర్లక్ష్యమా? అని నిలదీశారు.

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిలా అన్నదాతల పరిస్థితి తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాలు పడి నీళ్లొచ్చినా, రైతులకు అందించలేని పరిస్థితి నెలకొందని, అందుకు వైసీపీ ప్రజాప్రతినిధులే కారణమని ఆరోపించారు. వరదలొస్తే విపత్తు నిర్వహణ చేయలేరు, పండిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలేరు... రైతు అంటే మీకు అంత లెక్కలేని తనమా? అంటూ వ్యాఖ్యానించారు.

ఇవాళ నెల్లూరులో పెన్నా వారధిని సందర్శించిన సోమిరెడ్డి అక్కడే మీడియాతో మాట్లాడారు. 2015లో తమ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాగే వరదలు సంభవించి గండ్లు పడితే కృష్ణపట్నం పోర్టు నుంచి అతిపెద్ద బ్లాకులు తీసుకువచ్చి వారంలోపే గండ్లు పూడ్చామని చెప్పారు. అధికారికంగా, అనధికారికంగా కలుపుకుని పెన్నా కింద 1.20 లక్షల ఎకరాలు సాగవుతోందని, ఇప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని విమర్శించారు. జిల్లాకు చెందిన మంత్రి ఇప్పటికే ఈ పని పూర్తి చేసి ఉండాల్సిందని అన్నారు.

సర్వేపల్లి నియోజకవర్గానికి చెందిన భూములు పెన్నా కింద అత్యధికంగా సాగులో ఉన్నాయని, కానీ అక్కడి ఎమ్మెల్యే అన్నీ తనకే తెలుసంటాడని, మాట్లాడితే డబుల్ డిగ్రీ అంటాడని విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యేలు తమను తాము పొగుడుకుంటూ, టీడీపీ నేతలను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసరమైన సమస్యలు వచ్చినప్పుడే కదా ప్రజాప్రతినిధి పనిచేయాల్సింది అని సోమిరెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజల సంక్షేమాన్ని వదిలేసి ఎంతసేపూ గాలి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

More Telugu News