JC Prabhakar Reddy: ఒకవేళ నన్ను చంపుతారేమో... అంతకుమించి ఏం చేస్తారు?: జేసీ తీవ్ర వ్యాఖ్యలు

  • తాడిపత్రిలో యుద్ధ వాతావరణం
  • జేసీ ఇంటిపై దాడులు
  • ఎమ్మెల్యే కేతిరెడ్డిపై జేసీ తీవ్ర ఆగ్రహం
  • పోలీసుల వైఫల్యం ఉందని వెల్లడి
  • పోలీసులు మారాలని హితవు
JC Prabhakar Reddy alleges police helped YCP MLA

తాడిపత్రిలో తాను లేని సమయంలో తన ఇంటిపై స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన అనుచరులతో దాడి చేశారంటూ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోలీసుల వైఖరి సరిగాలేదని, పోలీసులు ఇలాగే ఉంటే ఆఖరికి వాళ్ల పిల్లలకు కూడా రక్షణ ఉండదని అన్నారు. తన ఇంటిపై దాడిలో పోలీసుల పాత్ర కూడా ఉందని ఆరోపించారు. వాళ్లు, వాళ్లు ఏం మాట్లాడుకున్నారో తనకు తెలియదని చెప్పారు. తాను ఇవాళ ఓ పెళ్లికి వెళ్లానని, పెళ్లిలో ఉండగా తనకు ఫోన్ వచ్చిందని జేసీ వెల్లడించారు.

"అన్నా పెద్దారెడ్డి వచ్చినాడన్నా... నన్ను కొట్టారు అంటూ ఆ కుర్రాడు ఫోన్ చేశాడు. ఎందుకు కొట్టారు అంటే... పెద్దారెడ్డి భార్య మీద ఏదో విషయం వైరల్ అయిందంట అందుకని కొట్టారన్నా అని చెప్పాడు. అసలు వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా దాడులు చేయడమేంటి? ఇదంతా పోలీసుల వైఫల్యమే! ఎమ్మెల్యే మా ఇంటికి వస్తే ఎస్సై తలుపు తీయడం ఏంటి? హత్య వ్యవహారాల్లో ఉన్నవాళ్లకు గన్ మెన్లను ఇస్తున్నారు, కానీ మాకు భద్రత లేకుండా పోయింది. ఒకవేళ నన్ను చంపుతారేమో... అంతకుమించి ఇంకేం చేస్తారు? నా రాత ఎలా ఉంటుందో అలా జరుగుతుంది. దేనికీ భయపడేది లేదు. అప్పుడెలా ఉన్నానో ఇప్పుడూ అలాగే ఉన్నాను" అని వ్యాఖ్యానించారు.

More Telugu News