Theft: బంధువుల్లా పెళ్లికొచ్చారు.. పెళ్లి కుమార్తె నగలనే కొట్టేశారు!

Huge theft in marriage hall
  • నిజామాబాద్ జిల్లాలో ఘటన
  • బర్దీపూర్ ఫంక్షన్ హాల్ లో పెళ్లి
  • పెళ్లిలో బంధువుల్లా హడావిడి చేసిన ఇద్దరు వ్యక్తులు
  • మహిళ దృష్టిని ఏమార్చి పెళ్లికుమార్తె నగలతో పరారీ
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన వరుడి తండ్రి
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం బర్దీపూర్ లో ఓ పెళ్లివేడుక సందర్భంగా చోరీ జరిగింది. పెళ్లికి వచ్చిన కొందరు వ్యక్తులు ఏకంగా పెళ్లికుమార్తె నగలనే ఎత్తుకెళ్లారు. సిద్ధిపేట జిల్లాకు చెందిన ఫణీంద్ర అనే యువకుడికి మహారాష్ట్ర వాసి కావ్యతో పెళ్లి కుదిరింది.

బర్దీపూర్ శివారు ప్రాంతంలో ఉన్న ఓ మ్యారేజి హాలులో పెళ్లికి ఏర్పాట్లు జరిగాయి. బంధుమిత్రుల రాకతో ఆ ఫంక్షన్ హాల్ కళకళలాడిపోయింది. ఇంతలో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. పెళ్లి జరుగుతుండగా, బంధువుల్లా ఎంతో హడావిడి చేస్తూ అందరిలో ఇట్టే కలిసిపోయారు. ముందు వరుసలోనే కూర్చుని వివాహ తంతును వీక్షించారు.

అయితే, పెళ్లి క్రతువు పూర్తయిన తర్వాత జరిగే ఘట్టాల సందర్భంగా పెళ్లికుమార్తె నగలను తీసి ఓ బ్యాగులో ఉంచారు. ఇది గమనించిన ఆ ఇద్దరు వ్యక్తులు ఆ బ్యాగును పట్టుకుని ఉన్న మహిళ వద్దకు వెళ్లారు. ఆ ఇద్దరిలో ఒకరు ఆమె దృష్టి మరల్చగా, మరో వ్యక్తి ఇదే అదనుగా బ్యాగ్ ను మాయం చేశాడు. ఆమె ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఆ ఇద్దరూ ఫంక్షన్ హాల్ నుంచి ఉడాయించారు.

దాంతో పెళ్లివేడుక కాస్తా గందరగోళంగా మారింది. రూ.20 లక్షల విలువైన బంగారు నగలు దొంగలపాలు కావడంతో పెళ్లికుమార్తె బంధువులు లబోదిబోమన్నారు. ఈ ఘటనపై వరుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని అక్కడి సీసీ కెమెరా ఫుటేజి పరిశీలించారు. అనంతరం దర్యాప్తు షురూ చేశారు.
Theft
Bride
Bride Groom
Nizamabad District
Police

More Telugu News