తెలుగులో కన్నడ సినిమా రీమేక్.. హీరోగా సునీల్!

22-12-2020 Tue 17:27
  • హీరోగా సక్సెస్ కాలేకపోయిన సునీల్
  • మళ్లీ కామెడీ, విలన్ పాత్రల పోషణ
  • తెలుగులో కన్నడ 'బెల్ బాటమ్' రీమేక్
  • రిషబ్ శెట్టి పాత్రకు సునీల్ ఎంపిక    
Suneel in Kannada film remake
సునీల్ కెరీర్ భలే మలుపులు తిరుగుతూ సాగుతోంది. కమెడియన్ గా ఎంటరై.. పలు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు చక్కిలిగింతలు పెట్టిన సునీల్.. తదనంతర కాలంలో కొన్ని సినిమాలలో హీరోగా నటించాడు. అయితే, హీరోగా సక్సెస్ కాలేకపోవడంతో మళ్లీ ఇటీవలి కాలంలో కమెడియన్ గా.. విలన్ గా కూడా నటిస్తున్నాడు. అదే సమయంలో మళ్లీ హీరోగా కూడా కొన్ని సినిమాలలో నటిస్తూ తనదైన ముద్ర వేస్తున్నాడు.

ఈ క్రమంలో ఈ హాస్యనటుడు ఓ కన్నడ సినిమా తెలుగు రీమేక్ లో కథానాయకుడుగా నటించనున్నట్టు తెలుస్తోంది. రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో ఇటీవల కన్నడలో రూపొందిన 'బెల్ బాటమ్' సినిమా ఓటీటీ ద్వారా విడుదలై, మంచి కామెడీ సినిమాగా రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడీ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ చిత్రకథ, అందులోని పాత్ర సునీల్ కు బాగా సూటవుతాయన్న ఉద్దేశంతో ఆయనను హీరోగా ఎంచుకున్నట్టు చెబుతున్నారు. ఈ ప్రాజక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.