Corona Virus: టీకా అత్యవసర వినియోగానికైనా సరే... తొందర వద్దే వద్దు: కేంద్రానికి పార్లమెంటరీ కమిటీ సూచన

  • ఏ క్షణమైనా టీకా అందుబాటులోకి వస్తుందని వార్తలు
  • అన్ని జాగ్రత్తలూ తీసుకున్న తరువాతే అనుమతించండి
  • మౌలిక వసతులపై ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలి
  • ఆనంద్ శర్మ నేతృత్వంలోని కమిటీ సిఫార్సు
After Enough Trials only give Permission on Vaccine

కరోనాను నియంత్రించే రోగ నిరోధక శక్తిని పెంచేలా టీకా ఏ క్షణమైనా ఇండియాలో అందుబాటులోకి రావచ్చని వార్తలు వస్తున్న వేళ, అత్యవసర వినియోగానికి అనుమతి విషయంలో తొందర పడవద్దని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది.

ఆనంద్ శర్మ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ తన నివేదికను అందిస్తూ, టీకా ట్రయల్స్ సంతృప్తికరంగా పూర్తయి, అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలూ తీసుకున్న తరువాతనే వినియోగానికి అనుమతులు ఇవ్వాలని, నిబంధనల ప్రకారం, అన్ని దశలూ పూర్తయిన తరువాతనే టీకా వినియోగంపై నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.

టీకా తయరీ తరువాత తొలుత చిన్న జంతువులపై, ఆపై మానవులపై పలు దశల్లోనూ పరీక్షించి, ఫలితాలను విశ్లేషించడం తప్పనిసరని గుర్తు చేసిన స్టాండింగ్ కమిటీ, తొందర పాటుతో నిర్ణయాలు కూడదని పేర్కొంది. ఈ మేరకు 'మేనేజ్ మెంట్ ఆఫ్ కొవిడ్-19 పాండమిక్ అండ్ కో-ఆర్డినేషన్ విత్ స్టేట్ గవర్నమెంట్స్' పేరిట తన నివేదికను అందించింది. ఈ కమిటీలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులున్నారు. వ్యాక్సిన్ పంపిణీకి అవసరమైన మౌలిక వసతులు, శీతల గిడ్డంగులు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తే, వారికి అందించాల్సిన చికిత్సలు తదితరాలపైనా కమిటీ పలు సిఫార్సులు చేసింది.

కాగా, ఇప్పటివరకూ మూడు వ్యాక్సిన్ సంస్థలు తాము తయారు చేసిన టీకాలను  అనుమతించాలని కేంద్రానికి దరఖాస్తులు పెట్టుకున్నాయన్న సంగతి తెలిసిందే. భారత్ బయోటెక్, సీరమ్ ఇనిస్టిట్యూట్, ఫైజర్ సంస్థలు వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలంటూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాను కోరాయి. వీటిపై సీడీఎస్సీఓ (కమిటీ ఆఫ్ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్) నిపుణుల కమిటీ తన సిఫార్సులను ఇస్తే, వాటి ఆధారంగా డీసీజీఐ నిర్ణయం తీసుకోవాల్సి వుంది.

More Telugu News