Vivek Murthy: బ్రిటన్ లో వెలుగుచూసిన కొత్తరకం కరోనా ఏమంత ప్రాణాంతకం కాదు: అమెరికా వైద్యనిపుణుడు వివేక్ మూర్తి

  • అమెరికా భావి సర్జన్ జనరల్ గా ఎంపికైన వివేక్ మూర్తి
  • రూపాంతరం చెందిన కరోనా వైరస్ పై అభిప్రాయాల వెల్లడి
  • ఇది వేగంగా వ్యాప్తి చెందుతోందని వివరణ
  • వ్యాక్సిన్లతో కట్టడి చేయవచ్చని వ్యాఖ్యలు
  • కొవిడ్ నివారణలో జాగ్రత్త చర్యలే మూలస్తంభాలని స్పష్టీకరణ
US medical expert Vivek Murthy opines on new corona strain

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన జో బైడెన్ జాతీయ సర్జన్ జనరల్ గా ప్రముఖ వైద్య నిపుణుడు వివేక్ మూర్తిని ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. భారత సంతతికి చెందిన వివేక్ మూర్తి తాజాగా బ్రిటన్ లో స్వైరవిహారం చేస్తున్న కరోనా కొత్తరకం స్ట్రెయిన్ పై అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ కొత్తరకం కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న మాట నిజమేనని, అయితే అది ప్రాణాలు తీసేంత ప్రమాదకారి కాదనుకుంటున్నామని తెలిపారు. రూపాంతరం చెందిన ఈ కొత్త కరోనా వైరస్ ను వ్యాక్సిన్ లు ఏమీ చేయలేవని చెప్పేందుకు తగిన కారణాలు లేవని వివరించారు.

వైరస్ సంగతి ఎలా ఉన్నా, ప్రజలు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యల్లో మాత్రం మార్పు ఉండదని వివేక్ మూర్తి స్పష్టం చేశారు. కొత్త వైరస్ కైనా అవే జాగ్రత్త చర్యలు పాటించాల్సి ఉంటుందని, మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి అంశాలే కొవిడ్ నివారణలో మూలస్తంభాలని అభిప్రాయపడ్డారు.

More Telugu News