Bangladesh: సరిహద్దు హత్యలు ఆగాలంటే గీత దాటొద్దు: బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్ డైరెక్టర్ జనరల్

  • దౌత్యచర్చలు, ప్రజల్లో అవగాహనతోనే అది సాధ్యం
  • బార్డర్ ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేయడమూ ముఖ్యమే
  • బీజీబీని సాంకేతికంగా అభివృద్ధి చేయడం పెద్ద సవాల్
  • ఈ నెల 22 నుంచి 4 రోజులు ఇండియాతో డైరెక్టర్ జనరల్ స్థాయి చర్చలు
Border killings can be stopped If people stops crossing India border

సరిహద్దుల్లో హత్యలు ఆగాలంటే బార్డర్ లోని జనాలు గీత దాటి ఇండియా భూభాగంలోకి వెళ్లొద్దని బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ) డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ ఎండీ షఫీనుల్ ఇస్లాం అన్నారు. దౌత్య చర్చలు, ప్రజల్లో అవగాహన, బార్డర్ లో నివసించే ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా సరిహద్దు హత్యలను తగ్గించొచ్చని ఆయన చెప్పారు. బీజీబీ డే సందర్భంగా ప్రధాన కార్యాలయంపై జెండాను ఎగరేసిన తర్వాత ఆయన మాట్లాడారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని పిల్ఖానాతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బెటాలియన్లలోనూ బీజీబీ డేని నిర్వహించారు.  

ఇండియన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), బీజీబీ మధ్య ఈ నెల 22 నుంచి 25 వరకు నాలుగు రోజుల పాటు గువాహాటీలో జరగబోయే 51వ రౌండ్ డైరెక్టర్ జనరల్ స్థాయి చర్చల్లో (డీజీఎల్ టీ) ఈ విషయాన్ని లేవనెత్తుతామని ఇస్లాం చెప్పారు. మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామన్నారు.

ప్రపంచంతో పాటు ముందుకు పోవాలంటే బీజీబీని సాంకేతికంగా చాలా అభివృద్ధి చేయాల్సి ఉందని, అదే ఇప్పుడు తమ ముందున్న అతిపెద్ద సవాల్ అని ఆయన చెప్పారు. బలగాల పహారా లేనిచోట బార్డర్ ఔట్ పోస్టుల (బీవోపీ) ఏర్పాటు మరో సవాల్ అన్నారు. బార్డర్ లో నివసించే ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేయడంలో భాగంగా 100 మంది మత్స్యకారులకు పడవలను పంపిణీ చేశామని, రాబోయే రోజుల్లో మరిన్ని ఇస్తామని ఆయన వివరించారు.

కాగా, డైరెక్టర్ జనరల్ స్థాయి చర్చల్లో భాగంగా 11 మంది బంగ్లాదేశ్ డెలిగేషన్ కు మేజర్ జనరల్ ఇస్లాం నేతృత్వం వహించనున్నారు. ఆ దేశ ప్రధాని కార్యాలయం, హోం శాఖ, విదేశాంగ శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొంటారు. భారత్ తరఫున 12 మంది సభ్యుల డెలిగేషన్ ను బీఎస్ ఎఫ్ చీఫ్ రాకేశ్ ఆస్థానా లీడ్ చేయనున్నారు. హోం శాఖ, విదేశాంగ శాఖ సీనియర్ అధికారులతో పాటు భద్రతా బలగాల ఐజీలు, ఇతర ఉన్నతాధికారులు చర్చల్లో పాల్గొననున్నారు.

రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల్లోని నదీ తీరాల పరిరక్షణ, పరస్పర సహకారంతో సరిహద్దు నిర్వహణ ప్రణాళిక (సీబీఎంపీ) అమలు, పరస్పర విశ్వాసం, మైత్రిని పెంపొందించేందుకు చేపట్టాల్సిన చర్యలు వంటి వాటి గురించి చర్చించనున్నారు. డిసెంబర్ 25న జాయింట్ రికార్డ్ ఆఫ్ డిస్కషన్స్ (జేఆర్ డీ)పై రెండు దేశాలు సంతకం చేయడం ద్వారా చర్చలు ముగుస్తాయి.

More Telugu News