KP Sharma Oli: నేపాల్ లో మరోసారి రాజకీయ సంక్షోభం... పార్లమెంటు రద్దు చేసిన ప్రధాని

  • అధికార పక్షంలో భగ్గుమన్న విభేదాలు
  • ప్రధాని నిర్ణయాన్ని సమర్థించిన కేబినెట్
  • రద్దు నిర్ణయాన్ని దేశాధ్యక్షురాలికి నివేదన
  • పార్లమెంటు రద్దుకు ఆమోదం తెలిపిన బైద్యదేవి భండారి
  • వచ్చే వేసవిలో ఎన్నిక
Nepal Prime Minister KP Sharma Oli decide to dissolve parliament

ఇటీవల కాలంలో నేపాల్ లో రాజకీయ అనిశ్చితి కనిపిస్తోంది. అధికార పక్షంలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. నేపాల్ పార్లమెంటును ప్రధాని కేపీ శర్మ ఓలి రద్దు చేస్తూ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు రద్దును కేంద్ర కేబినెట్ కూడా ఆమోదించింది. రద్దు నిర్ణయాన్ని కేబినెట్ దేశ్యాధ్యక్షురాలికి పంపింది.

కాగా, కేబినెట్ నిర్ణయాన్ని అధికార నేపాల్ కమ్యూనిస్టు పార్టీ తప్పుపట్టింది. ప్రతిపక్షాలు కూడా ఇదే తరహా అభిప్రాయాలు వెలిబుచ్చాయి. కేబినెట్ నిర్ణయం ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో దేశం తిరోగమనంలోకి వెళుతుందని నేపాల్ కమ్యూనిస్టు పార్టీ అధికార ప్రతినిధి నారాయణకాజీ శ్రేష్ఠ వ్యాఖ్యానించారు.

ఇక, ప్రధాని, కేబినెట్ సిఫారసు మేరకు దేశాధ్యక్షురాలు బైద్యదేవి భండారి దేశ పార్లమెంటును రద్దుకు ఆమోదం తెలిపారు. తదుపరి ఎన్నికలు 2021 ఏప్రిల్ 30 నుంచి మే 10వ తేదీ మధ్య జరుగుతాయని బైద్యదేవి భండారి ఓ ప్రకటనలో తెలిపారు.

ఓ వివాదాస్పద ఆర్డినెన్స్ రద్దు చేయాలని అధికార కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వాన్ని కోరుతోంది. అయితే, ప్రధాని కేపీ శర్మ ఓలి వర్గం ససేమిరా అంటోంది. దాంతో సొంత పార్టీ నుంచే ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంటు రద్దు నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతోంది.

More Telugu News