Corona Virus: దేశంలో కరోనా పతాకస్థాయి ముగిసినట్టే... సెకండ్ వేవ్ అవకాశాలు చాలా తక్కువ: నిపుణుల వెల్లడి

  • దేశంలో కరోనా తీరుతెన్నులపై నిపుణుల అభిప్రాయాలు
  • జనసమ్మర్ద ప్రాంతాల్లో నిదానించిన వైరస్ వ్యాప్తి
  • రోజువారీ కేసుల సగటు తగ్గిందని వెల్లడి
  • కొన్ని రాష్ట్రాల్లో హెచ్చుతగ్గులు ఉన్నట్టు వివరణ
  • పరిశీలించాల్సి ఉందని స్పష్టీకరణ
Experts says no chances for second wave in India

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తీరుతెన్నులపై నిపుణులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. భారత్ లో కరోనా పతాకస్థాయి దశ ముగిసిందని తెలిపారు. ప్రముఖ వైరాలజిస్టు డాక్టర్ షాహిద్ జమీల్ స్పందిస్తూ, సెప్టెంబరు మాసం మధ్యలో నిత్యం 93 వేల వరకు కొత్త కేసులు వచ్చిన పరిస్థితి చూశామని, కానీ ఇప్పుడు రోజుకు పాతిక వేల కేసులు మాత్రమే వస్తున్నాయని వివరించారు. కొత్త కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపించని నేపథ్యంలో కరోనా పతాకస్థాయి దశ ముగిసినట్టే భావించాలని పేర్కొన్నారు. అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లోనూ కరోనా వ్యాప్తి నెమ్మదించడం సానుకూలాంశమని, అయితే ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారు వైరస్ బారినపడే అవకాశాలను కొట్టివేయలేమని తెలిపారు.

ప్రముఖ క్లినికల్ శాస్త్రవేత్త డాక్టర్ గగన్ దీప్ సింగ్ స్పందిస్తూ ఒకప్పుడు ఉన్నంత తీవ్రత ఇప్పుడు లేదని, సెకండ్ వేవ్ రాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. అత్యధిక కేసులు వచ్చిన దేశాల్లో ఒకటైన భారత్ లో కరోనా రెండో తాకిడి వచ్చినా అంత ఉద్ధృతంగా ఉండకపోవచ్చని ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ కేకే అగర్వాల్ వెల్లడించారు. అయితే, రాష్ట్రాల్లో పరిస్థితులు వేరుగా ఉన్నాయని, కొన్నిచోట్ల హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయని ఐసీఎంఆర్ ఎపిడమాలజీ, అంటువ్యాధుల విభాగం హెడ్ డాక్టర్ సమీరన్ పాండా వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితిపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని పేర్కొన్నారు.

More Telugu News