యువకుడి వేధింపులు తాళలేక.. 10వ తరగతి బాలిక ఆత్మహత్య

20-12-2020 Sun 12:38
  • గుంటూరు జిల్లాలోని మేడికొండూరు మండలంలో ఘటన
  • పరారీలో నిందితుడు
  • పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు
10th class student commits suicide

ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధిస్తుండడంతో పదో తగరతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని మేడికొండూరు మండలం కొర్రపాడులో జరిగింది. స్థానికంగా ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతోన్న విద్యార్థిని సౌమ్యను వరప్రసాద్‌ అనే యువకుడు కొంత కాలంగా ప్రేమపేరుతో వేధిస్తున్నాడు.

దీంతో సౌమ్య పురుగుల మందు తాగింది. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఓ యువకుడు తనను వేధిస్తున్నాడని, ఆ వేధింపులు ఇక భరించలేనంటూ, వరప్రసాద్ వల్లే తాను చనిపోతున్నానంటూ ఆ బాలిక ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో రూపంలో చెప్పింది. ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతోన్న సమయంలో ఈ వీడియో తీశారు. తనను వేధించిన యువకుడిని కఠినంగా శిక్షించాలని ఆ బాలిక కోరింది.

అనంతరం ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. వర ప్రసాద్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేశారు. సౌమ్య కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పరామర్శించారు.