Snowfall: జపాన్ లో హిమ విలయం.... 40 గంటల పాటు నరకం అనుభవించిన వాహనదారులు

  • జపాన్ లో ఎడతెరిపిలేని విధంగా కురిసిన మంచు
  • రోడ్లపై కొన్ని అడుగుల మేర పేరుకుపోయిన మంచు
  • మంచులో కూరుకుపోయిన కార్లు, ఇతర వాహనాలు
  • హైవేపై నిలిచిపోయిన వాహనాలు
  • తిండితిప్పలు లేక అల్లాడిపోయిన వాహనదారులు
Heavy snowfall causes huge traffic jam in Japan

భూకంపాలకు నిలయమైన జపాన్ లో భారీ స్థాయిలో హిమపాతం సంభవించింది. ఎడతెరిపిలేకుండా కురిసిన మంచుకు టోక్యో- నైగటా ఎక్స్ ప్రెస్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 1000 వాహనాలు రోడ్డుపైనే మంచులో కూరుకుపోయాయి. అరగంట, గంట కాదు... ఏకంగా 40 గంటల పాటు వాహనదారులకు నరకం కనిపించిందంటే అతిశయోక్తి కాదు.

మంచు అలా ఏకధాటిగా కురుస్తూనే ఉండడంతో రోడ్డుపై వాహనాలు ముందుకు కదిలే వీల్లేకపోవడంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఒకటిన్నర రోజుకు పైగా తమ వాహనాల్లోనే ఆకలిదప్పులతో అలమటించారు. దాహం వేయడంతో నీళ్లు దొరక్కపోగా, మంచు ముక్కలను బాటిళ్లలో వేసుకుని అవి కరిగిన తర్వాత ఆ నీటిని తాగారు. ముగ్గురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వారిని సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.

చివరికి ప్రభుత్వ సిబ్బంది రహదారులపై మంచును అతికష్టం మీద తొలగించడంతో వాహనాలు ముందుకు కదిలాయి. కొన్ని అడుగుల మేర పేరుకుపోయిన మంచును తొలగించేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. భారీ బుల్డోజర్లను రంగంలోకి దింపి మంచును తొలగించి రోడ్లను సాఫీగా చేశారు.

More Telugu News