CBI: ఈ ఉదయం నుంచి రాయపాటి సాంబశివరావు నివాసంలో సీబీఐ సోదాలు

  • ఈ ఉదయం 8 గంటల నుంచి సీబీఐ సోదాలు షురూ
  • సెర్చ్ వారెంట్ తో వచ్చిన సీబీఐ అధికారులు
  • పలువురు బ్యాంకు అధికారులు కూడా రాక
  • ట్రాన్స్ ట్రాయ్ ఆర్థిక లావాదేవీల విషయంలో సోదాలు
  • బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల అంశంలో సోదాలు
CBI raids on former MP Rayapati Sambasiva Rao house

టీడీపీ నేత, పార్లమెంటు మాజీ సభ్యుడు రాయపాటి సాంబశివరావు నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉదయం 8 గంటల నుంచి సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం సీబీఐ అధికారులు గుంటూరు జిల్లా లక్ష్మీపురంలోని రాయపాటి నివాసానికి చేరుకున్నారు. సెర్చ్ వారెంట్ చూపించి సోదాలకు ఉపక్రమించారు. ఈ సోదాల్లో సీబీఐ అధికారులతో పాటు పలు బ్యాంకులకు చెందిన అధికారులు కూడా పాలుపంచుకున్నట్టు తెలుస్తోంది.

ప్రధానంగా ట్రాన్స్ ట్రాయ్ సంస్థకు చెందిన వ్యవహారంలోనే ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఇంతకుముందు పోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టింది ఈ ట్రాన్స్ ట్రాయ్ కంపెనీనే. ప్రాజెక్టు పనుల నేపథ్యంలో సెంట్రల్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, దేనా బ్యాంకు, కెనరా బ్యాంకు తదితర బ్యాంకుల నుంచి ట్రాన్స్ ట్రాయ్ పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుంది. దీనికి సంబంధించి పలు బ్యాంకులకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నమోదైన కేసులపై నేడు సోదాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

అయితే ట్రాన్స్ ట్రాయ్ సంస్థతో తమకు సంబంధాలు లేవని రాయపాటి కుటుంబీకులు చెబుతున్నారు. ఆ సంస్థ నుంచి చాలాకాలం కిందటే బయటికి వచ్చినట్టు స్పష్టం చేస్తున్నారు. కాగా, రాయపాటి నివాసంలో సీబీఐ సోదాలు ఇదే మొదటిసారి కాదు. 2019 డిసెంబరు మాసంలోనూ సోదాలు నిర్వహించి పలు ఫైళ్లు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News