West Bengal: మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న నేతలు

  • అసన్‌సోల్ మునిసిపల్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి ఎమ్మెల్యే జితేంద్ర తివారీ రాజీనామా
  • అసన్‌సోల్‌ను స్మార్ట్ సిటీ ప్రాజెక్టుగా ఎంపిక చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపణలు 
  • ప్రజలకు సేవ చేయలేని పదవి అక్కర్లేదన్న జితేంద్ర
Jitendra Tiwari quits as Asansol civic body chief

ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తృణమూల్ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. టీఎంసీలో మమత తర్వాతి నాయకుడిగా పేరున్న సువేందు అధికారి నిన్న తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కాసేపటికే మరో ఎమ్మెల్యే జితేంద్ర తివారీ అసన్‌సోల్ మునిసిపల్ కార్పొరేషన్ పాలకమండలి చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశ్రామిక ప్రాంతమైన అసన్‌సోల్‌ మునిసిపల్ కార్పొరేషన్‌ను స్మార్ట్ సిటీ ప్రాజెక్టుగా ఎంపిక చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, ఫలితంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కోల్పోతోందని అన్నారు. ఈ విషయాన్ని చెబుతూ కొన్ని రోజుల క్రితం మునిసిపల్ శాఖ మంత్రి పిర్హాద్ హకీంకు లేఖ రాసినా ఎలాంటి స్పందన రాలేదని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయనప్పుడు ఈ పదవి ఎందుకుని ప్రశ్నించిన జితేంద్ర.. అందుకే రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు.

కాగా, పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సువేందు అధికారి రేపు మిడ్నాపూర్‌లో బీజేపీ నిర్వహించనున్న కార్యక్రమంలో అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని ఆయన మద్దతుదారులు తెలిపారు. టీఎంసీకే చెందిన మరో సీనియర్ నాయకుడు దీప్తంగ్షు చౌదరి కూడా దక్షిణ బెంగాల్ రాష్ట్ర రవాణా సంస్థ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. టీఎంసీ నుంచి మరికొందరు నేతలు కూడా ఆ పార్టీని వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ పేర్కొన్నారు.

More Telugu News