Corona Virus: కరోనా వ్యాక్సిన్ ఇవ్వగానే ఈ లక్షణాలు కనిపిస్తాయట!

Experts explains Corona Vaccine after effects
  • అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లో వ్యాక్సిన్ పంపిణీ
  • వ్యాక్సిన్ వేయించుకుంటే నలతగా ఉంటుందన్న నిపుణులు
  • తలనొప్పి, చలితో ఫ్లూ తరహా జ్వరం వస్తుందని వివరణ
  • ఈ లక్షణాలు ఒకరోజు ఉంటాయని స్పష్టీకరణ
  • వ్యాధి నిరోధక వ్యవస్థ సక్రమ పనితీరుకు నిదర్శనాలని వెల్లడి
కరోనా మహమ్మారిని పారదోలేందుకు కొన్ని దేశాలు వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించాయి. కొన్నిదేశాల్లో వ్యాక్సిన్ లకు అత్యవసర అనుమతులు లభించడంతో పంపిణీ ప్రక్రియలు ఊపందుకున్నాయి. అమెరికా, కెనడా, బ్రిటన్  తదితర దేశాల్లో వ్యాక్సిన్ పంపిణీ షురూ అయింది. అయితే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వ్యక్తి శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయన్నదానిపై నిపుణులు అవగాహన కలిగించే ప్రయత్నం చేశారు.

వ్యాక్సిన్ వేయించుకున్న వ్యక్తికి మొదట్లో కాస్తంత నలతగా ఉంటుందని అమెరికా వైద్య నిపుణులు తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకున్న చేయి నొప్పిగా ఉండడం, తలనొప్పి, చలితో కూడిన ఫ్లూ జ్వరం లక్షణాలు కనిపిస్తాయని వెల్లడించారు. ఈ లక్షణాలు ఒకరోజు ఉంటాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. వ్యాధి నిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేస్తోందనడానికి ఈ లక్షణాలు సంకేతాలని స్పష్టం చేశారు. ఇతర వ్యాక్సిన్లు వేయించుకున్నప్పుడు కూడా ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయని తెలిపారు.

అయితే, వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు అలర్జీకి గురైన వాళ్లు అరగంట పాటు అక్కడే ఉండాలని, మామూలు వ్యక్తులు పావుగంట పాటు ఉంటే ఏవైనా దుష్పరిణామాలు కలిగితే గుర్తించేందుకు వీలుంటుందని నిపుణులు వివరించారు. వ్యాక్సిన్ పై ఉండే మూల పదార్థాల జాబితాను ఆరోగ్య కార్యకర్తలను అడిగి తెలుసుకోవడం మంచిదని, వాటిలో తమకు అలర్జీ కలిగించే పదార్థం ఉంటే ఆ వ్యాక్సిన్ తీసుకోకపోవడమే మంచిదని స్పష్టం చేశారు. కాగా, బ్రిటన్ లో ఇద్దరికి, అమెరికాలో ఒకరికి కరోనా వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం అలర్జీ లక్షణాలు కనిపించినట్టు గుర్తించారు.
Corona Virus
Vaccine
Side Effects
USA
UK

More Telugu News