Chandrababu: ద్రౌపది వస్త్రాపహరణంతో రాజ్యమే కూలిపోయింది... రాజధాని మహిళల శాపాలతో వైసీపీ నామరూపాల్లేకుండా పోతుంది: చంద్రబాబు

  • అమరావతి రైతులు, మహిళలకు చంద్రబాబు సంఘీభావం
  • భూములు అమ్ముకుంటే తప్పేంటన్న చంద్రబాబు
  • నన్ను ఇల్లు కట్టలేదని అంటున్నారు 
  • ఇల్లు కట్టి నువ్వు ఏం ఉద్ధరించావని జగన్ పై వ్యాఖ్యలు
  • నీ తెలివి నా దగ్గర పారదని హెచ్చరిక
Chandrababu comments on CM Jagan and YSRCP at Janabheri meeting

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అమరావతి రైతులకు సంఘీభావంగా ఇవాళ జనభేరి సభకు విచ్చేశారు. ఉదయం కనకదుర్గమ్మను దర్శించుకుని, ఆపై ఉద్ధండరాయునిపాలెంలో రాజధాని శంకుస్థాపన స్థలాన్ని సందర్శించిన అనంతరం చంద్రబాబు  జనభేరి సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు.

రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులపై తాము గతంలో ఎలాంటి ఆంక్షలు విధించలేదని, ఆ మాత్రం ఇంగితజ్ఞానం కూడా మీకు లేదా? అని ప్రశ్నించారు. రైతులు భూములు అమ్ముకోకూడదని ఎక్కడైనా ఉందా అని నిలదీశారు. "ఒకపక్కన నువ్వు ఇంకా భూమి కొనలేదు ఇల్లు కట్టలేదని నన్నంటాడు. నువ్వు ఇల్లు కట్టావు.. ఏం ఉద్ధరించావని నేనడుగుతున్నా.  ఇల్లు కట్టావు కానీ మోసం చేశావు. ఇవాళ నీ నిజస్వరూపం చూపిస్తున్నావు. మాట్లాడితే కులం అంటున్నావు... నా కులంలో నేను పుడితే అది తప్పా? ఒక్కొక్కరు ఒక్కో కులంలో పుడతారు.

హైదరాబాదును అభివృద్ధి చేశామంటే అక్కడ కులం చూడలా. పులివెందులకు నీళ్లు ఇచ్చామంటే కులం ఉందని కాదు. విశాఖను అభివృద్ధి చేశామంటే అక్కడ కులం కోసం కాదు... ప్రజల కోసం తప్ప మరొకటి కాదు. చాలా తెలివైన వాడిననుకుంటున్నావు... నా దగ్గరా నీ తెలివితేటలు? జగన్ రెడ్డీ గుర్తుపెట్టుకో... నీ తెలివి నా దగ్గర ఎప్పటికీ పారదు. పోలీసులను అడ్డంపెట్టుకుని దాడులు చేయిస్తే మా ఆడబిడ్డలు రాణి రుద్రమదేవిలా పౌరుషాన్ని చూపారు. దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాన్ని తాకినందుకే ఆ రాజ్యమే కూలిపోయింది. మా ఆడబిడ్డల శాపాలతో ఈ వైఎస్సార్ పార్టీ నామరూపాల్లేకుండా పోతుంది.. ఇది జరిగి తీరుతుంది.

అమరావతి అంటే ఈ సీఎంకు ఎందుకింత కోపమో అర్థం కావట్లేదు. ఇవాళ రాజధాని రైతుల కోసం టీడీపీ, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, జనసేన, బీజేపీ... రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు వచ్చాయి. ఊరందరిదీ ఒకదారి అయితే ఈ ముఖ్యమంత్రిది మరోదారి. ఇంతకంటే వితండవాదం మరొకటి ఉంటుందా? రాజధానికి ఇంతకంటే మంచి ప్లేసు మరొకటి ఎక్కడుంది? శివరామకృష్ణ కమిటీ చెప్పింది కూడా ఇదే. జాతీయ మీడియా సర్వేలో 80 శాతం మంది రాజధాని ఇక్కడే ఉండాలని చెప్పారు.

రాష్ట్రమంతా నీతోనే ఉందని చెప్పుకుంటున్నావు కదా... మరి రిఫరెండంకు వెళదామా? మీరు ప్రజల ముందుకు వెళ్లి మీ పరిపాలన ఎట్లా ఉందో చెప్పండి, మూడు రాజధానులు కావాలా అని అడగండి... ప్రజలు గనుక మూడు రాజధానులు కావాలి అని ఓటేస్తే  నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి విరమించుకుంటా. ఈ సీఎం తెలివి గురించి చెప్పాలంటే చాలా ఉంది. పనికిమాలిన దద్దమ్మ తెలివితేటలు. అసెంబ్లీ సమావేశాల్లో నేను పట్టుబట్టి పోడియం దగ్గర కూర్చుంటే నన్ను తప్ప అందరినీ సస్పెండ్ చేసి ఆ సాయంత్రం ఇన్సూరెన్స్ కట్టారు. ఏమనాలి వీళ్ల తెలివిని? నేను తిట్టకూడదు అనుకుంటాను... కానీ రైతులు, మహిళల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది" అంటూ ప్రసంగించారు.

More Telugu News